దొరికింది శ్రీవారి పాదాలే!
రామచంద్రాపురం: తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం, నామాల కాలువలో ఈనెల 2వ తేదీ దొరికిన పాదాలు శ్రీవారి విగ్రహానివే అని నడవలూరు గ్రామస్తులు వెల్లడించారు. గత కొంత కాలం క్రితం ఆ గ్రామస్తులకు నల్ల రాతి విగ్రహంలోని శ్రీవారి ప్రతిమ (పాదాలకు పైభాగం) దొరకగా భద్రంగా దాచి పెట్టారు. తాజాగా దొరికిన పాదాలు ఆ విగ్రహానికి జోడించడంతో ఆ రెండు సమానంగా కలిశాయి. దీంతో గతంలో దొరికిన రాతి విగ్రహం, పాదాలు ఒకటిగా ఉండడంతో అవి శ్రీవారి పాదాలుగానే నిర్ధారణ చేశారు. రాయల చెరువు నిర్మాణానికి ముందు కార్వేటి నగరం రాజులతో పాటు తమిళనాడు నుంచి వెళ్లే శ్రీవారి భక్తులు గుండోడు కణం మీదుగా తిరుమలకు వెళ్లేవారని, ఆ భక్తులు నామాల కాలవలో పుణ్యస్నానాలు ఆచరించి నామాలు ధరించి ఆ తర్వాత తిరుమలకు వెళుతుంటారని, అందుకే ఆ కాలువను నాటి నుంచి నేటివరకు నామాల కాలువగా పిలిచేవారన్నారు. హిందూ దేవాలయాలపై నవాబులు దాడులు చేసిన సమయంలో ఈ నామాల కాలవలో ఉన్న స్వామివారి విగ్రహంపై కూడా దాడిచేసి స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నామాల కాలువ గట్టుపైనే ఆలయాన్ని పునః నిర్మాణం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. టీటీడీ అధికారులు స్పందించి నామాల కాలవను అధీనంలోకి తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment