● ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉదాసీనత ● రెవెన్యూ అధికారు
ప్చ్..వదిలేశారు!
చంద్రగిరి: చంద్రగిరిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించినా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వాహనాలను వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనే గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. రెడ్డివారిపల్లి, బ్రహ్మంగారి ఆలయం, నాగయ్యగారిపల్లి, కేశవరెడ్డి పాఠశాల వెనుక వైపున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో నిరసనలకు దిగిన నాగయ్యగారిపల్లి గ్రామస్తులు ముందుండి ఇసుక విక్రయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తహసీల్దార్ శివరామసుబ్బయ్య ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి బ్రహ్మంగారి ఆలయం వద్ద జేసీబీల ద్వారా ఇసుక తరలిస్తున్నారంటూ ఫిర్యాదు వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ బృందం సభ్యులు ఒక జేసీబీతో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాటిని అప్పగించారు.
ఉన్నతాధికారి ఫోన్‌తో వదిలేశారు!
పట్టుబడిన జేసీబీను వదిలేయాలంటూ అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చంద్రగిరికి చెందిన ఓ నేత తన పరపతిని ఉపయోగించి స్టేషన్‌లోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి తమ జేసీబీని విడిచిపెట్టాలంటూ ఆదేశించాలని కోరినట్లుగా సమాచారం. దీంతో సిబ్బంది ఆ అధికారి ఆదేశాలను పాటించి జేసీబీని వదిలేశారు. తర్వాత పట్టుబడిన ఐదు ఇసుక ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. తాము అడ్డుకుంటున్నా పోలీసులే పరోక్షంగా వారికి సహకారం అందిస్తున్నారంటూ రెవెన్యూ అధికారులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. వారం వారం వాటాలు అందడంతోనే ఇలా పోలీసులు వదిలేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment