విశేషాలంకరణలో స్వామి,అమ్మవార్లు
రాపూరు : వేదమంత్రాలు.. మంగళవాయిద్యాలు.. ముత్యాల తలంబ్రాలు.. నమో నారసింహా స్మరణల నడుమ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం నయనానందకరంగా సాగింది. శుక్రవారం పెంచలకోనలో దేవదేవేరుల పెళ్లి ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ముందుగా ఉదయం 10 గంటలకు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవర్లను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చారు. అనంతరం శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణమండపానికి వేంచేపు చేశారు. వేదపండితులు తొలుత శ్రీవారు, అమ్మవార్లకు భాసికం, కంకణాలు ధరింపజేశారు. విష్వక్సేన పూజ అనంతరం దేవదేవేరుల గోత్రాలు చెప్పి కన్యాదాన కార్యక్రమం నిర్వహించారు. సుముహూర్తంలో మంగళసూత్ర ధారణ జరిపించారు. స్వామివారి కల్యాణం విశిష్టతను వేదపండితులు భక్తులకు వివరించారు. శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని టీటీడీ తరఫున పేషీ అధికారి శ్రీహరి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవుడి పెళ్లి ముహూర్తంలో వేదిక వద్ద పలువురు నూతన వధూవరులు వివాహం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి పెద్దసంఖ్యలో భక్తులు కానుకలు చదించారు. దాదాపు రూ.1.24లక్షలు చదివింపుల రూపంలో వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లతోపాటు ఆంజనేయునికి ప్రత్యేక పూలంగిసేవ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్‌రెడ్డి, దేవదాయశాఖ అధికారి శ్రీనివాసులరెడ్డి, ఈఓ జనార్ధన్‌రెడ్డి, జొన్నవాడ ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, దేవుడు వెల్లంపల్లె ఈఓ శ్రీధర్, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, పాల్గొన్నారు.
కనులపండువగా రథోత్సవం
పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రఽథంపై స్వామివారు ఉభయనాంచారులతో కలిసి కోన తిరువీధుల్లో ఊరేగారు. రాత్రి 10 గంటలకు ఏనుగు అంబారీపై స్వామి, అమ్మవార్లు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
నేడు చక్రస్నానం, తెప్పోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం చక్రస్నానం, వసంతోత్సవం, తెప్పోత్సవం, అశ్వవాహనసేవ, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment