అమ్మవారి కుమ్మరింట ఆలయం
వెంకటగిరి రూరల్: వెంకటగిరి జాతరలో ప్రధాన ఘట్టం ఘటోత్సవాన్ని ఆదివారం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అఽధిక సంఖ్యలో తరలిరానున్నారు. ప్రధానంగా ఘటోత్సవంలో అమ్మవారికి బలిచ్చే దున్నపోతును, ఘటం కుండలను ప్రతి ఇంటా తిప్పుతారు. ఆపై గాలిగంగుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జీనుగుల వారి వీధికి విచ్చేస్తారు. అక్కడ దున్నపోతుకు ప్రత్యేక పూజలు చేసి పోలేరమ్మతల్లి ఆలయం వద్దకు తీసుకొస్తారు.
సంప్రదాయానికి పెద్దపీట
జాతరకు ముందు తొలుత వెంకటగిరిరాజా ప్యాలెస్‌లో తొలిపూజ.. తర్వాత తాటిపత్రియుల ఇంట మలిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత అమ్మవారి పుట్టినిల్లు కుమ్మరింట, మెట్టినిల్లు జీనుగులవారి వీధి, తర్వాత పట్టణంలోని ప్రతి ఇంటికీ ఘటోత్సవ కుండలు తిరగడం సంప్రదాయద్ధంగా నిర్వహిస్తారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.
భారీ ఏర్పాట్లు
పోలేరమ్మ తల్లి జాతరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర పండుగ హోదాలో ఈనెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్న జాతరకు వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. అమ్మవారి పుట్టినిల్లు అయిన కుమ్మరింట, మెట్టినిల్లు జీనుగులవారి వీధి, అమ్మవారి ఆలయం, ఆర్చి తదితర ప్రదేశాలు రంగులతో ముస్తాబు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యుద్దీపాలంకరణలు శోభాయమానకంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment