దోపిడీ నిజం
ఇసుక ఉచితం..
ప్రభుత్వ స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్..
రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఎనిమిది ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. వెంకటగిరి మండలం మొగళ్లగుంట, సూళ్లూరుపేట నియోజక వర్గం దొరవారిసత్రం మావిళ్లపాడు, సత్యవేడు నియోజక వర్గం నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగ, పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు, చిత్తూరు జిల్లాలో గంగవరం మండలం నాలుగు రోడ్ల కూడలి, చిత్తూరు రూరల్ మండల పరిధిలో దిగువమాసాపల్లి, పాలూరు వద్ద ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఒక్క చిత్తూరు రూరల్ మండల పరిధిలో ఒక స్టాక్ పాయింట్‌లో తప్ప మరెక్కడా ఇసుక లేదు. ఇసుక లేకపోవడంతో ఆన్‌లైన్ బుకింగ్ జరగడం లేదు. చిత్తూరులో ఆన్‌లైన్ బుకింగ్ ఉన్నా.. టీడీపీ నేతలే బినామీ పేర్లతో బుక్ చేసుకుని, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
పేదలకు ఇసుక దొరకడం గగనం.. కారణం.. ఉమ్మడి జిల్లాలో అధిక శాతం పాయింట్లు బోసిపోవడం.. అయితే పచ్చనేతలకు మాత్రం లభ్యం.. ఇందుకు అనధికారిక రీచ్‌లే తెలుగుతమ్ముళ్లకు ఆధారం.. ఏదీ ఏమైనా ఇసుక ఉచితం.. దోపీడీ నిజం. ఇదీ జిల్లాలో సైఖతం స్థితి.
● రేణిగుంటకు చెందిన రహంతుల్లా రెండు నెలల క్రితం సొంతింటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇంటి ని ర్మాణానికి ఇసుక దొరక్క.. ఓ సారి పిచ్చాటూరు అ డవికోయంబేడులో ఓ ట్రాక్టర్, పాడిపేట సమీపంలో టీడీపీ నేతల చుట్టూ పలుసార్లు ప్రదక్షిణలు చేసి అతికష్టంపై మరో ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్నాడు. ఇంకా రహంతుల్లాకి పది ట్రిప్పుల ఇసుక అవసరం. ఇసుక కోసం ప్రభుత్వ రీచ్‌లు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇసుక దొరకలేదు. చేసేది లేక ప్రస్తుతం నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేశారు.
● శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డు కాలనీలో టీడీపీకి చెందిన నాయకులు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. వీరు చుక్కలనిడిగల్లు సమీపంలోని స్వర్ణముఖి నుంచి రాత్రి సమయాల్లో జేసీబీతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఇసుక డంప్ చేసుకున్నారు. కూటమి నేతలు, అనుచరుల భవన నిర్మాణాలకు ఇసుక కొరత లేదు. వారికి మాత్రం కావాల్సినంత ఇసుక లభ్యమవుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ప్రభుత్వ రీచ్‌ల్లో ఇసుక లేదు.. పొరుగు జిల్లాలైన నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు వెళ్లి తెచ్చుకోండి. ఒకవేళ ఇసుక కావాలంటే.. ప్రభుత్వం రీచ్‌లు ఏర్పాటు చేసే వరకు ఆగితే దొరుకుతుంది. అప్పటి వరకు మేమేమీ చెయ్యలేం’ అని భూగర్భ గనులశాఖ జిల్లా అధికారి బాలాజీ నాయక్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఇసుక విషయమై సంబంధిత అధికారులతో సమావేశం అ య్యారు. పెళ్లకూరు, కోట మండలాల పరిధిలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించినట్లు, ఆయా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టీడీపీ నేతల అనధికారిక రీచ్‌ల్లో ఇసుక ఫుల్
ఎన్నికల ముందు ఇసుకను ఉచితంగా ఇస్తామని గొప్పలు చెప్పిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక జేబులు నింపుకోవడానికి ఇసుకను అక్రమంగా తవ్వి తరలించి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ల వద్ద గత 40 రోజులుగా ఇసుక కరువైంది. అయితే టీడీపీ నేతలకు మాత్రం కావాల్సినంత ఇసుక లభ్యమవుతోంది. స్వర్ణముఖి, కౌండిన్య, కాళంగి, ఆరణియార్, నీవాలో ఇసుక ఉన్నా.. అధికారులు మాత్రం స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయాలనే బాధ్యత మరిచారు. 162 కి.మీ విస్తరించి ఉన్న స్వర్ణముఖిలో అవసరమైనంత ఇసుక ఉన్నా.. అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మకై ్క నదిలో లభ్యమయ్యే ఇసుకను రాత్రి వేళలో జేసీబీలతో తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తు తం టీడీపీ నేతలు స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో చంద్రగిరి, పాడిపేట, గాజులమండ్యం, పాపానాయుడుపేట, పెనుమల్లం, గోవిందవరం, కొత్తవీరాపురం, ముసిలిపేడు, మోదుగులపాళెం, అబ్బాపట్లపల్లి, పుల్లారెడ్డి కండ్రిగ, అమ్మపాళెం, శ్రీకాళహస్తి, చెంబేడు, కలవకూరు, పెళ్లకూరు, నాయుడుపేట, భీమవరం, మర్లపల్లి, అన్నమేడు, చిట్టమూరు మండల పరిధిలోని గుణపాడు, కోట మండల పరిధిలోని గూడలి, వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం కూడలి, గూడూరు మండలం కై వల్యానది పరివాహక ప్రాంతంలోని ఇందూరు, పంబలేరు, కాళంగి నదీ పరివాహక ప్రాంతంలో ఇల్లుపూరు, కరుణానది, అరుణానదీ పరీవాహక ప్రాంతం, నీవా నది పరీవాహక ప్రాంతమైన కొట్రకోన, జీడీ నెల్లూరు, వేల్కూరు, ముక్కల తూరు, రాసమరెడ్డిపల్లి, పాతపాలెం, కౌండిన్య నది పరీవాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుకను తవ్వి విక్రయించేందుకు ఒక్కో టీడీపీ నేత ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పగించారు. ట్రాక్టర్ ఇసుకను రూ.2,500 విక్రయిస్తుంటే.. ఇందులో నుంచి రూ.1,200 సంబంధిత అధికారులకు వాటా రూపంలో పంపుతున్నారు. మిగిలిన రూ.1,300 టీడీపీ నేతలు, కాంట్రాక్టర్ పంచుకుంటున్నారు. స్వర్ణముఖి నదిలో లభ్యమయ్యే ఇసుకకు తమిళనాడు, బెంగళూరులో మంచి డిమాండ్ ఉండడంతో అధికశాతం పక్కరాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇసుక లేదు.. పక్క జిల్లాల్లో తెచ్చుకోండి
నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలుకు వెళ్లండి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌ల్లో ఇసుక లేదు.. రాదు
ఇసుక కోసం అన్వేషిస్తున్నామంటున్న అధికారులు
చేతులెత్తేసిన అధికార యంత్రాంగం..
ఆందోళనలో వినియోగదారులు
Comments
Please login to add a commentAdd a comment