సూర్య,చంద్ర ప్రభ..
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల నడుమ భాస్కరునిపై వేంకటపతి బద్రి నారాయణ అలంకారంలో స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహనంలో చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు వర్షంలోనే నిల్చుని మలయప్పస్వామిని దర్శించుకున్నారు. వర్షానికి స్వామివారిని ఘటాటోపం కింద తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో బ్రహ్మోత్సవాల్లో మూడో స్నపన తిరుమంజనంలో శ్రీదేవి, భూదేవి సమే త మలయప్ప స్వామివారు సేద తీరారు. సాయంత్రం ఆలయం వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయల ఊగుతూ దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనసేవలో మంగళధ్వనుల, పండితుల వేద ఘోషలో చల్లనయ్య శ్వేత వర్ణ కలువల అలంకరణలో భక్తలోకానికి తన దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఇక వాహన సేవల్లో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. నాదనీరాజనం, ఆస్థాన మండపంలో కళాకారులు భక్తి, సంగీత కార్యక్రమాలు భక్తులకు వీనుల విందు చేశాయి.
బ్రహ్మోత్సవాల్లో
బ్రహ్మాండనాయకుడు
ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు
తిరుమంజనంలో సేద తీరిన
దేవదేవుడు
సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడైన ఆధిత్యుడిపై అభిషేకప్రియుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు ఆయురారోగ్యప్రాప్తిని ప్రసాదించాడు. నక్షత్రాలకు అధిపతి, ఆహ్లాదకారి అయిన చంద్రుడిపై చల్లనయ్య శ్వేత వర్ణ కలువల అలంకరణలో కొలువుదీరి, భక్తకోటికి దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజైన గురువారం తిరువేంకటనాథుడికి సూర్య, చంద్రప్రభ వాహనసేవలు వైభవంగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment