ఏపీ రీసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు
తిరుపతి సిటీ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎస్వీయూ నిర్వహించిన ఏపీఆర్ సెట్ 2023–24 లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు గురువారం మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామని కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసెట్ చైర్మన్ ఆచార్య కె రామ్మోహన్‌రావు సూచనల మేరకు రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో సైన్స్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో పీహెచ్‌డీ (పార్ట్ టైం, ఫుల్ టైం) 2,566 సీట్లకు వెబ్ వెరిఫికేషన్ జరిపి సీట్ల కేటాయించామన్నారు. తొలిదశలో ఫుల్ టైం కోర్సుల్లో 771 మంది, పార్ట్ టైం కోర్సుల్లో 1,237 మంది, మొత్తం 2,008 మందికి సీట్లు కేటాయించినట్లు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయాల్లో నేరుగా ఈనెల 14 నుంచి 19వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై అడ్మిషన్లు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఎరువుల డీలర్లతో
అధికారులు సమీక్ష
తిరుపతి అర్బన్: నకిలీ విత్తన విక్రయాలపై దుకా ణాల డీలర్లతో వ్యవసాయాధికారులు సమీక్షించారు. మొలకెత్తని నకిలీ విత్తనాలు విక్రయించడం, ఎమ్మార్పీకి కాకుండా అధనపు ధరలకు ఎరువులను రైతులకు అమ్మడం, అధికారుల పర్యవేక్షణ లేకుండా కమీషన్లకు అలవాటు పడి అధికారులు కార్యాలయానికి పరిమితం కావడం తదితర అంశాలను క్రోడీకరిస్తూ రెండు రోజులుగా సాక్షి దినపత్రికలో వస్తున్న కథనాలపై వ్యవసాయశాఖ జిల్లా అధికారులు స్పందించారు. గురువారం హుటిహుటిన తిరుపతిలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు విక్రయించకూడదని, ఎమ్మార్పీకే ఎరువులు అమ్మకాలు చేయాలని, వ్యాపారులు సిండికేట్ అయి...ఎరువుల కొరత సృష్టిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సూచనలు చేసి పంపించారు. కలెక్టరేట్ ఏడీ ధనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment