పేరుకే రివ్యూ.. ప్రత్యర్థులపైనే విమర్శలు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: పేరుకు అధికారులతో సమీక్ష సమావేశం.. కానీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలకే ప్రాధాన్యతనివ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మంగళవారం ఉదయం 11 సమీక్ష సమావేశమని చెప్పి ఏకంగా మధ్యాహ్నం ఒంటిగంటకు హాజరవడంతో ఇటు జిల్లా అధికారయంత్రాంగం.. అటు మీడియా ప్రతినిధిలు తీవ్ర అసహనానికి గురయ్యారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా మొదటిసారి తిరుపతికి విచ్చేశారు. మొదటి రోజు సోమవారం కూటమి అంతర్గత సమావేశంలో పాల్గొన్నారు. రెండో రోజు మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, జనసేన నాయకులు దర్జాగా అధికారుల మధ్యలో కూర్చుని కాలక్షేపం చేశారు. దీంతో సమీక్ష సమావేశం కాస్త రాజకీయ సమావేశంలా మారిపోయింది. ఇదిలా ఉంటే.. అనుకున్న సమయం 11 గంటలకు అని చెబితే.. మంత్రి మధ్యాహ్నం 1 గంటలకు హాజరయ్యారు. దీంతో అప్పటికే అధికారులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రారంభమైన సమీక్ష సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు సాగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రెస్ మీట్ అని ఐఎన్‌పీఆర్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ సమయానికంటే ముందే చేరుకున్న మీడియా మిత్రులు సాయంత్రం 3.30 గంటల వరకు వేచి చూసి సహనం నసించి నేరుగా అధికారుల సమీక్ష సమావేశం మందిరంలోకి చేరుకున్నారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ అని చెప్పి సాయంత్రం అవుతోందని చెప్పారు. దీంతో ఇన్‌చార్జ్ మంత్రి అధికారుల సమక్షంలోనే విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, పార్టీని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్రెస్ మీట్, సమీక్ష సమావేశం రాజకీయ కార్యక్రమంలా మారిపోయింది. ఇన్‌చార్జ్ మంత్రి రాజకీయ విమర్శలు చేస్తుంటే.. కలెక్టర్, ఎస్పీ, మరికొందరు ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందికి గురవ్వడం గమనార్హం.
స్థానిక సమస్యల ప్రస్తావనేది?
అధికారుల సమీక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను ఎక్కడా ప్రస్తావించలేదు. గత ప్రభుత్వంలో అక్కడ అవినీతి జరిగింది.. ఇక్కడ అవినీతి జరిగింది దానిపై విచారణ చేపట్టండి అంటూ కాలయాపన చేశారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్థానిక ఆర్డీవోతోపాటు ఫారెస్ట్ అధికారులు యాక్టి వ్‌గా పనిచేయాలంటూ ఆదేశాలివ్వడంతో పలువులు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజకీయ రంగుపులుముకున్న అధికారుల సమీక్ష సమావేశం
ఎంపీ, ఎమ్మెల్యేలు కాకుండా.. పలువురు పార్టీ నాయకుల హాజరు
కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారుల మధ్యనే రాజకీయ విమర్శలు
ఉదయం 11కు రివ్యూ మీటింగ్ అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకు హాజరు
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమావేశంపై అధికారులు, మీడియా ప్రతినిధుల అసంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment