24న గ్రామీణ ఆటల ఉత్సవం
తిరుపతి అర్బన్: 16వ గ్రామోత్సవ ప్రిమియర్ లీగ్ 2024 పోటీలు తిరుపతిలోని ఎస్వీయూ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సయద్యబాషా తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సయద్య బాషా మాట్లాడుతూ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పురుషులు, త్రోబాల్ మహిళల పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న పంచాయతీ క్రీడా జట్లు ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. వాలీబాల్, త్రోబాల్‌లో విజేతలైన వారికి నగదు బహుమతి ఉంటుందని చెప్పారు. వాలీబాల్‌లో మొదటి బహుమతి రూ.9 వేలు, 2వ బహుమతి రూ.6 వేలు, మూడో బహుమతి రూ.3వేలు, 4వ బహుమతి రూ.2 వేలుగా ప్రకటించినట్టు వెల్లడించారు. అలాగే త్రోబాల్‌లో మొదటి బహుమతి రూ.5 వేలు, 2వ బహుమతి రూ.3వేలు, 3వ బహుమతి రూ.2 వేలు, 4వ బహుమతి రూ.1,500 అందిస్తామన్నారు. మొదటి రెండు స్థానాలు కై వసం చేసుకున్న జట్లు జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయన్నారు. వారు డిసెంబర్ మొదటి వారంలో విజయవాడలో జరిగే జోనల్ క్రీడల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఫైనల్స్ కోయంబత్తూరులో డిసెంబర్ 28న జరుగుతాయని వివరించారు. స్పోర్ట్ అధికారులతోపాటు ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చెరువుల సుందరీకరణ వేగవంతం
తిరుపతి అర్బన్:తిరుపతి నగరంలోని వివిధ ట్యాంక్‌ల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ మౌర్యతో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా వినాయకసాగర్, పాన్‌చెరువు, గొల్లవానిగుంట, కోరమేనుగుంట చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా వినాయక సాగర్, గొల్లవాణి గుంట ఇప్పటికే అభివృద్ధి చేశారని, మిగిలిన వాటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తుడా అవిలాల చెరువు అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీపీవో సుశీలాదేవి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
గూడూరు రూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వృద్ధుడ్ని ఆటో ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం.. బాలాయపల్లి మండలానికి చెందిన అల్లం ఈశ్వరయ్య(60) తన గేదెలు కనిపించకుండా పోవడంతో వాటిని వెతుక్కుంటూ వెంకటగిరి– గూడూరు రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో గూడూరు వైపు వస్తున్న ఆటో అతనిని వేగంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గూడూరు రూరల్ ఎస్ మనోజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment