నీకు 15 వేలు, నీకు 18 వేలు..!
● పేదలకు ఆశజూపిన బాబు ● నోటికొచ్చిన అబద్ధాలతో అధికారం ● ఆరు నెలలైనా అమలు చేయని వైనం ● కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి ధ్వజం
తడ: ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ పగటి వేషగాని తరహాలో చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను మూటగట్టి అటక మీద పడేశాడని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎద్దేవా చేశారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే చిరు సాయాన్ని కూడా బాబు విస్మరించారని ధ్వజమెత్తారు. మత్స్యకార భరోసా పేరుతో రూ.10 వేలకు పెంచి అధికారంలోకి వచ్చిన వెంటనే అందించిన ఘనత జగనన్నదని చెప్పారు. ఆ రూ.10వేలను రూ.20 వేలకు పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు పైసా విదల్చలేదని మండిపడ్డారు. కేవలం మద్యం దుకాణాలు, బెల్టు షాపులు గడపగడపకూ అందుబాటులోకి తేవడం మినహా కూటమి ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీ గురుమూర్తి చొరవతో పులికాట్ సరస్సులో ఇసుక మేట తొలగించేలా రూ.97 కోట్లు మంజూరయ్యాని గుర్తుచేశారు. వాతావరణం అనుకూలించి ఉంటే గత ఏడాది నవంబర్‌లో జగనన్న పూడికతీత కార్యక్రమానికి శంఖుస్థాపన చేయాల్సి ఉండేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు కే.ఆర్ముగం, వైస్ ఎంపీపీ రమేష్, పెరియవట్టు సర్పంచ్ చిన్నప్పన్, నాయకులు రాజేంద్రన్, శివలింగం, సుందర్‌రెడ్డి, శశికుమార్, వరప్రసాద్, ప్రకాష్, మురుగన్, వాసు, తిరుమలై పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment