డ్రోన్ తయారీపై ఎంఓయూ
తిరుపతి సిటీ: డ్రోన్ వ్యవస్థపై శిక్షణ, తయారీ, పరిశోధనలపై ఎస్వీయూ పలు సంస్థల తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు. వర్సిటీ వీసీ చాంబర్‌లో గురువారం ఆయన రిజిస్ట్రార్ భూపతినాయుడితో కలసి పలు సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీసీ మాట్లాడుతూ విద్యాపరమైన పరిశోధన, ఆవిష్కరణలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డ్రోన్‌ల తయారీ, మహిళల కోసం డ్రోన్ వంటి కార్యక్రమాల్లో బలమైన సహకారం కోసం డ్రోన్ వ్యవస్థలకు సంబంధించిన పలు సంస్థలతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామమన్నారు. ఇందుకోసం ‘డ్రోన్స్, స్పేస్ టెక్నాలజీస్ కన్సార్టియం’ ప్రతినిధులు అధికారికంగా సంతకం చేశారన్నారు. ఒప్పందపు పత్రాల్లో సంతకం చేసిన వారిలో ఆర్‌ఎఫ్‌ఎల్‌వై ఇన్నోవేషన్స్ సంస్థతో పాటు ఎర్త్‌నౌ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మిస్టర్ రితేష్ కుమార్ సింగ్, ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బరహలికర్ నర్సింగ్ రావు, ఔరంటియస్ డైరెక్టర్ ప్రణవ్‌కుమార్ చిట్టే, టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్‌ప్రసాద్, రుసా అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment