పచ్చని పసిడి పంటలు.. కళకళలాడే వరి మడులు.. నోరూరించే చిర
వరదయ్యపాళెం మండలం, ఎంజీనగర్ వద్ద నాటిన యూకలిప్టస్ మొక్కలు
యూకలిప్టస్ సాగు ఇలా..
ప్రధానంగా యూకలిప్టస్ చెట్లను ఒక్కసారి సాగు చేస్తే 25 ఏళ్ల వరకు ఫలితాన్ని పొందవచ్చు. నాలుగేళ్లకు ఒకసారి సాగు చేసిన చెట్లు కట్టింగ్‌కి వస్తాయి. ఇలా సాగు చేసిన ప్రతి మొక్కనూ ఆరు సార్లు కట్టింగ్ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2,200 మొక్కలు అవసరమవుతాయి. ఈ మొక్కలు నాటేందుకు గుంత తీసి మొక్క నాటడానికి ఒక్కో చెట్టుకు రూ.8 వరకు కూలీ కింద ఖర్చవుతుంది. దీంతో పొలం దున్నకం మొదలు మొక్క నాటడం వరకు ఒక్కో ఎకరానికి రూ.25 వేలు ఖర్చుపెడితే చాలు. ఇలా ఒకసారి పెట్టుబడితో 25 ఏళ్ల వరకు ఈ మొక్క పెరుగుదలకు కాలపరిమితి ఉంటుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎకరం చెట్లు నాటితే ఖర్చులన్నీ పోను రూ. 2లక్షల వరకు ఆదాయం పొందవచ్చని రైతులు అంటున్నారు. ఎకరం చెట్లు సాగు చేస్తే 80 టన్నుల వరకు కలప వస్తుంది. తద్వారా టింబర్‌కు వెళ్లే కలప టన్ను రూ.9 వేలకు, సన్నటి కలప టన్ను రూ.6 వేల వరకు మార్కెట్లో రేటు పలుకుతోంది. దీంతో సరాసరిన ఏడాదికి ఒక ఎకరం చెట్ల పెంపకం ద్వారా రూ. 50 వేల వరకు రాబడి ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి ఎక్కువ..
దిగుబడి తక్కువ
జిల్లాలోని తూర్పు మండలాలైన బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తారు. అయితే ఈ పంట సాగుకు పెట్టుబడి కింద ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుంది. వ్యయప్రయాసలకోర్చి పంటను సాగు చేసినప్పటికీ దిగుబడి అంతంత మాత్రమే. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తే... మంచి గిట్టుబాటు ధర ఉన్నప్పుడు మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వస్తుంది. పెట్టుబడులకు పోను మిగిలేది నామమాత్రమే. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. నాలుగు నెలల పాటు చేసిన కష్టానికి కూలి కూడా రాదని వాపోతున్నారు. ఈ పరిణామంతో కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లుతుందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రోత్సాహం కరువు
● వేధిస్తున్న కూలీల కొరత ● ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల చూపు
● భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం ● అంతకంతకూ తగ్గుతున్న దిగుబడి
● పెట్టుబడి సాయానికి పంగనామాలు ● ఆందోళనలో అన్నదాతలు
పది ఎకరాల్లో యూకలిప్టస్
సాగు చేస్తున్నా
నాకు 30 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ప్రతి ఏడాదీ వరి, వేరుశనగ సాగు చేస్తా. అయితే ఈ రెండు పంటలతో ప్రతి ఏడాదీ నష్టం వాటిల్లుతోంది. కారణం కూలీల కొరత, అధిక పెట్టుబడులే. దీంతో ప్రత్యామ్నాయంగా ఒకేసారి పెట్టుబడి, కూలీలతో పనిలేని యూకలిప్టస్ చెట్ల పెంపకం వైపు మొగ్గు చూపాను. మొదటి విడతగా 10 ఎకరాలలో యూకలిప్టస్ చెట్లు సాగు చేస్తున్నాను. రానున్న ఏడాదికి మరో 10 ఎకరాల్లో చెట్లు నాటేందుకు సిద్ధం చేస్తున్నాను.
– మల్లికార్జున్‌రెడ్డి, రైతు, సిద్ధాపురం
వ్యవసాయానికి ప్రోత్సాహం లేదు
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేదు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20వేలు ఇప్పటివరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో విరివిగా దొరికే ఎరువులు, విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో వరి, వేరుశనగ పంటలను సాగు చేసి నష్టాల పాలవడం కన్నా ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేశా. ఆ దిశగా నాకున్న 8 ఎకరాలలో యూకలిప్టస్ చెట్లు సాగుచేస్తున్నా.
– మురళీ, కాపుకండ్రిగ, రైతు, సత్యవేడు మండలం
కౌలుకు సాగు చేయడం లేదు
వ్యవసాయ యోగ్యమైన భూములలో సాగు చేసేందుకు కౌలు రైతులు సైతం ముందుకు రావడం లేదు. కారణం పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతే. భూస్వాములందరూ తమ భూములను బీడు భూములుగా వదిలేశారు. నా కున్న 10 ఎకరాలల్లో మొదటి విడతగా మూడు నెలల క్రితం ఐదు ఎకరాలలో యూకలిప్టస్ చెట్లు సాగు చేశా. ప్రస్తుత పరిస్థితులలో చెట్ల పెంపకమే మాలాంటి రైతులకు శరణ్యం.
–మునస్వామి యాదవ్, రైతు, తొండంబట్టు
వరదయ్యపాళెం: ఏ అదునుకు ఏ పంట సాగు చేయాలి.. ఏ వరి వంగడాలైతే అధిక దిగుబడినిస్తాయి.. ఏ రకం వేరుశనగ విత్తనాలైతే అధిక ఆదాయం వస్తుందని నిత్యం రైతులు తలమునకలయ్యేవారు. అదునుకు ముందే సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చని భావించేవారు. కానీ రానురాను వ్యవసాయం భారంగా మారడంతో విసిగిపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి తేరుకోలేకపోతున్నారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేక కుమిలిపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వరి, వేరుశనగ, ఇతర చిరుధాన్యాల పంటల సాగుకు ఫుల్‌స్టాప్ పెట్టి పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని తూర్పు మండలాల రైతులు యూకలిప్టస్ చెట్ల పెంపకం వైపు అడుగులేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం, బీఎన్‌కండ్రిగ, నాగలాపురం, సత్యవేడు మండలాల్లో దశల వారీగా యూకలిప్టస్ చెట్ల పెంపకానికి చొరవ చూపుతున్నారు.
వేధిస్తున్న కూలీల కొరత
సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత ప్రధాన సమస్యగా మారింది. కారణం రెండు మండలాల పరిధిలో అటు శ్రీసిటీ, ఇటు ఏపీఐఐసీ పరిధిలో మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటు కావడంతో చదువుకున్న వారికి, చదువు లేని వారికి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు విరివిగా లభిస్తున్నాయి. ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే పనులు కల్పించే వ్యవసాయ రంగానికి గ్రామస్థాయి నుంచి స్వస్తి పలుకుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే కూలీలతో పనులు చేయించుకోలేక చతికిల పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ రానున్న అతికొద్ది సంవత్సరాలకే ఈ ప్రాంతంలో వ్యవసాయ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది.
పెట్టుబడి సాయానికి మొండిచేయి
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 పెట్టుబడి సాయం కింద రైతులకు అందేది. ఎన్నికల హామీల్లో భాగంగా అదే పెట్టుబడి సాయాన్ని రూ.20 వేలకు పెంచుతామని ప్రచార సభల్లో నమ్మబలికింది. అయితే ఈ ఏడాది రబీ సీజన్ పూర్తవుతున్నా ఇంతవరకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు మళ్లీ రుణదాతల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
డిమాండ్ ఎక్కువ
మార్కెట్లో ప్రస్తుతం యూకలిప్టస్ కలపకు మంచి డిమాండ్ ఉంది. సత్యవేడు నియోజకవర్గంలో సాగవుతున్న యూకలిప్టస్ కలపను అదే నియోజకవర్గంలోని బీఎన్‌కండ్రిగ సమీపంలో ఉన్న కొన్ని పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే తమిళనాడు సమీపంలోని ఆరంబాకం వద్ద కూడా ఈ కలపకు మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా యూకలిప్టస్ కలప నుంచి గుజ్జు తీసి పేపర్ తయారీ పరిశ్రమకు, ప్లైవుడ్ తయారీ పరిశ్రమకు వినియోగిస్తున్నట్లు సమాచారం. సంబంధిత పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా యూకలిప్టస్ చెట్ల పెంపకం గురించి గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా సంబంధిత చెట్ల పెంపకం వైపు రైతులు అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment