కల్యాణి డ్యామ్‌కు వరద
ముంచెత్తిన ఫెంగల్ తుపాను
● వణికిస్తున్న ఈదురుగాలులు ● ఉప్పొంగుతున్న నదులు..వాగులు.. వంకలు ● ఛిద్రమైన రహదారులు.. విరిగిన స్తంభాలు ● పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు ● నీటమునిగిన పంటలు
ఉధృతంగా స్వర్ణముఖినది
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్యాణిడ్యాం, మల్లెమడుగులో నీరు స్వర్ణముఖి నదిలో కలుస్తుండడంతో నది ఉధృతి పెరిగింది. ఆదివారం వర్షం కురిస్తే ప్రవాహం మరింతే పెరిగే అవకాశం ఉంది.
మునిగిన పంటలు
ప్రస్తుత రబీ సీజన్‌లో అధికంగా వరి పంట సాగులో ఉంది. వదలని వాన కారణంగా పలు ప్రాంతాల్లో పంట నీట మునిగింది. ఇలాగే మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగితే రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదముంది.
అరణియార్ నుంచి నీటి విడుదల
నాగలాపురం : పిచ్చాటూరులోని అరణియార్ ప్రాజెక్టు నీటిమట్టం 27 అడుగులకు దాటింది. దీంతో ఆదివారం ఇరిగేషన్ డీఈ రామచంద్ర ఆధ్వర్యంలో గేట్లు తెరిచి నీరు విడుదల చేశారు. డీఈ మాట్లాడుతూ ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల వరద రావడంతో 500 క్యూసెక్కులను దిగువకు వదిలినట్లు వెల్లడించారు.
తిరుపతి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఫెంగల్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, వరవ కాలువలు ద్వారా చెరువులు, రిజర్వాయర్లకు నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. కాజ్‌వేలపై నుంచి వరద నీరు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాకపోకలు బంద్
● పెళ్లకూరు మండలం కొత్తూరు సమీపంలో కొర్రవాడి చెరువుకు గండి పడడంతో ఆయకట్టు పరిధిలోని వరి పంట నీటమునిగింది. అలాగే రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
● కాళంగి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంతో పూడి సీకేపురంతోపాటు, ఎగువ పూడి, మధ్య పూడికిరాకపోకలు ఆగిపోయాయి.
● కాళంగి రిజర్వాయర్ అవుట్ ఫ్లో కారణంగా పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూళ్లూరుపేట మండలంలోని పలు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి.
● నాయుడుపేట మండలంలో మామిడి కాలువ, తడ మండలంలో కర్వేటికాలువ, శ్రీకాళహస్తి మండలంలో ఈదులకాలువ, సున్నపు కాలువ, గూడూరు మండలంలో కై వల్యానది, ఉప్పుటేరు వెంకటగిరి మండలంలో కై వల్యా నది ప్రవాహంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు.
● వరదయ్యపాళెం మండలంలో మారేడు కాలువ ఉధృతి కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీకాళహస్తి–సూళ్లూరుపేట మార్గంలో కొన్నంబట్టు సమీపంలోని కల్వర్ట్ దెబ్బతింది.
● ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేట నుంచి గుడిమల్లానికి వెళ్లే మార్గంలో సీత కాలువ ప్రవాహంతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
● శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాల్లో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
● తిరుమలలోని ఐదు జలాశయాలకు వర్షపు నీరు పోటెత్తుతోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఆదివారం సాయంత్రం గేట్లు గంట సేపు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
నిలిచిన బస్సులు
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా మొత్తం 116 ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపేశారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 802 సర్వీసులకు గాను 686 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
చంద్రగిరి : తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు కల్యాణి డ్యామ్‌కు వరద నీరు చేరుతోంది. పది రోజుల క్రితం డ్యామ్‌లో స్టోరేజీ పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శేషాచల అడవుల నుంచి భారీగా వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం 841 అడుగుల నీటి మట్టం ఉండగా, ఆదివారం రాత్రికి 847 అడుగుల మేరకు పెరిగినట్లు వెల్లడించారు. 898.50 అడుగులకు నీరు చేరితే గేట్లు ఎత్తేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment