శ్రీవారి దర్శనం.. స్థానికులకు ప్రత్యేకం
తిరుమల : శ్రీవారి దర్శనం చేసుకునేందుకు స్థానికులకు ప్రత్యేక అవకాశం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం వైకుంఠనాథుని సేవించుకునే వెసులుబాటు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇందుకోసం టీటీడీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
● తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు జారీ చేస్తారు.
● వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యమిస్తూ టోకెన్లు కేటాయిస్తారు.
● టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి.
● దర్శన సమయంలో సైతం ఒరిజినల్ ఆధార్ కార్డును తెచ్చుకోవాలి.
● వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్ హాల్ (దివ్య దర్శనం) క్యూలైన్‌లో స్థానికులనుఉ దర్శనానికి అనుమతిస్తారు.
● దర్శనానంతరం ఒక లడ్డూను ఉచితంగా అందిస్తారు.
● స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారిని తిరిగి 90 రోజుల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతించరు.
అట్టహాసంగా ‘మహాసభ’
సత్యవేడు : సీపీఎం జిల్లా 14వ మహాసభ ఆదివారం సత్యవేడులో ప్రారంభమైంది. భారీ వర్షంలో సైతం పెద్దసంఖ్యలో కామ్రెడ్లు హాజరయ్యారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పు వాయించగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసరి జనార్ధన్ ఉద్యమ పాటలతో అగ్రనేతలకు స్వాగతం పలికారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎర్ర జెండా ఊపి, డప్పు కొట్టి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూల రమేష్, ఎం.భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సత్యవేడు కార్యదర్శి ఎం. రమేష్ , పి.సాయిలక్ష్మి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
మహిళలపై
అఘాయిత్యాలు దారుణం
తిరుపతి సిటీ : సభ్య సమాజం తలదించుకునేలా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు దారుణమని, ప్రభుత్వాలు కట్టడి చేయకుంటే పోరాటం తప్పదని ఇంటర్నేషనల్ హ్యూమన్‌రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (ఐహెచ్‌ఆర్‌పీసీ) హెచ్చరించింది. ఆదివారం ఎస్వీయూ సెనేట్ హాల్‌లో ఐహెచ్‌ఆర్‌పీసీ రాయలసీమ జోనల్ సమావేశం నిర్వహించారు. ఐహెచ్‌ఆర్‌పీసీ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ముజాహిద్, చైర్మన్ డాక్టర్ సోహెబ్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిత్యం వందల మంది మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వర్సిటీ ఏడీ బిల్డింగ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రశాంతి, శోభారాణి, కిరీటిరెడ్డి, బాలకృష్ణ, సునీల్, అరుణ్, రవి, మహేష్, మణికంఠ, బాలసుబ్రమణ్యం, గిరీష్, ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment