ప్రాణాల మీదకు తెస్తున్న కల్వర్టు
కేవీబీపురం (వరదయ్యపాళెం):భారీ వర్షాలు కురిస్తే కేవీబీపురం మండలంలోని పూడి సీకేపురం కల్వర్టు కొట్టుకుపోతుంది. ఏటా ఇది క్రమం తప్పకుండా జరుగుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణం చేపట్టకపోవడంతోనే అసలు సమస్య వస్తోంది. కొట్టుకుపోయిన ప్రతి పర్యాయం తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం మొక్కుబడిగా పనులు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
పాత కథే పునరావృతం
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూడి సీకేపురం కల్వర్టు పాత కథే పునరావృతమైంది. కల్వర్టు కొట్టుకుపోవడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వైద్యం అందక వ్యక్తి మృతి
కల్వర్టు కొట్టుకుపోవడంతో సకాలంలో వైద్య మందక ఓ పశువుల కాపరి మృతి చెందాడు. వివరాలు.. నక్కలకోన రమేష్ శుక్రవారం మూర్చ వ్యాధికి గురయ్యాడు. అయితే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. కల్వర్టు కొట్టుకుపోవడంతో నీటి ప్రవాహం కారణంగా కాజ్‌వేను దాటలేని దుస్థితి దాపురించింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుటుంబీకులు, గ్రామస్తులు చూస్తుండగానే రమేష్ కన్నుమూశాడు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment