అవినీతి భోజ్యం!
దస్త్రాల రాజ్యం..
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
● ప్యానెల్‌లో లేని జూనియర్ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా తిష్ట ● ప్రభుత్వ పెద్దలకు భారీ ముడుపులిచ్చి పోస్టింగ్ ● అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు ● రంగంలో దిగి అక్రమాల పుట్టను లోడుతున్న ఉన్నతాధికారులు
రేణిగుంట: రేణిగుంట సబ్‌రిస్ట్రార్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారింది. అక్రమార్కుల భరతం పట్టే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. తిరుపతి నగరానికి చెందిన విలువైన భూములన్నీ సింహ భాగం రేణిగుంట సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. కార్యాలంలో పనిచేసే సబ్‌రిజిస్ట్రార్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పోస్టింగ్‌కు ఎక్కువ డిమాండే ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతి, అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌కు గురయ్యారు. ఓ మహిళా సబ్ రిజిస్ట్రార్ అయితే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన నిధులను సైతం స్వాహా చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు.
జూనియర్ తిష్ట!
ఇక్కడ పనిచేసే ప్యానెల్‌లో లేని ఓ ఉద్యోగికి నిబంధనలకు విరుద్దంగా ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత బదిలీలు జరిగినా ఆ స్థానంలో రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్‌ను నియమించలేదు. ఆయన్నే కొనసాగించారు. రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ పెద్దల అండతో పాటు పెద్ద మొత్తంలో నియోజకవర్గంలోని కీలక నేతకు ముట్టజెప్పి సీటుని కదిల్చే సాహసం చేయనివ్వకుండా ఆయన తిష్ట వేసి కూర్చున్నారు. దీనికి తోడు కొత్తగా వచ్చిన ఓ అటెండర్ తోడుతో అక్రమార్జనకు గేట్లు ఎత్తి గల్లా పెట్టె తెరిచి ఉంచారు. ఇక్కడ ప్రభుత్వ భూమి అయినా, నిషేధిత జాబితాలోని భూమి అయినా చేయి తడిపితే రిజిస్ట్రేషన్లు చేసేస్తారు. తమ పరిధిలో లేని భూములను కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో వివాదాస్పద భూములకు సంబంధించి కొందరు మీడియేటర్లు డాక్యుమెంట్ రైటర్లను కలసి రేటు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐజీ తనిఖీలు చేసి అన్ని డాకుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లభ్యమైన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కూడా సోదాలు కొనసాగనున్నాయి. విచారణ నివేదికల ఆధారంగా కార్యాలయంలో పనిచేసే అవినీతి తిమింగలాలపై వేటు పడే అవకాశం ఉందని చర్చ జరిగితోంది.
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కర్నీ వదలం
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కర్నీ వదలమని రిజిస్ట్రేషన్ల శాఖ అడిషనల్ ఊజీ ఉదయభాస్కర్‌రావు, డీఐజీ గిరిబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యం ప్రదర్శిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఈ మేరకు సిబ్బందిని బయటకు పంపి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. ఇక్కడ ప్రయివేట్ సిబ్బంది ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు. నిషేధిత 21ఏ జాబితాలోని భూములు అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్, ఒక అటెండర్ మీద పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. రేణిగుంటలోని కొందరు డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు రిజిస్ట్రేషన్లకు వచ్చి న వారి నుంచి పెద్ద మొత్తంలో తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. నిషేధిత భూముల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేసిన డాక్యుమెంట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణ నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. రెండు రోజులు పాటు ఇక్క డే ఉండి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment