ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ అంతర వ్యవసాయ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలు–2024లో తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభ చాటారు. తిరుపతి, బాపట్ల, నైరా వ్యవసాయ కళాశాలల ప్రాంగణాల్లో రాష్ట్ర స్థాయిలో మూడు విడతల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థుల జట్టు బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. అంతేకాకుండా చె్‌స్, లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానం, హై జంప్‌లో తృతీయ స్థానం దక్కించుకుంది. ఫుట్ బాల్ విజేతగా, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, 100 మీటర్ల రిలేలో తృతీయ స్థానంలో నిలిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులను అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్‌వీ.రమణ ప్రత్యేకంగా అభినందించారు. ఎంఎస్‌వీ చలం, వ్యాయామ విభాగాధిపతి డాక్టర్ రవికాంత్‌రెడ్డి, వ్యాయామ అధ్యాపకురాలు జీ.రాజేశ్వరి అభినందించిన వారిలో ఉన్నారు.
లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన
తిరుపతి సిటీ : లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పద్మావతి మహిళా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డి.ఉమాదేవి తెలిపారు. మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం హ్యూమానిటీస్ బ్లాక్ సెమినార్ హాల్‌లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, సైగలు తదితర చేష్టల ద్వారా కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి లైంగిక వేధింపులు కార్యాలయాలు, పాఠశాలలు తదితర ప్రదేశాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. బాలికలు, మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం –2013 ప్రధాన లక్షణాలు, శిక్షల అమలుపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎం.ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి స్వాధీనం
– ఒకరి అరెస్ట్
నారాయణవనం: గంజాయిని విక్రయిస్తున్న తిరుపతికి చెందిన కడివి వెంకటేష్(47)ను అరెస్ట్ చేసి, అతని నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని కీళగరం–వెత్తలతడుకు పాత రోడ్డులో సోమవారం మధ్యాహ్నం గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, సిబ్బందితో గాలించామన్నారు. కీళగరం చెరువు కట్టపై అనుమానాస్పదంగా తిరుగుతున్న తిరుపతి టౌన్ క్లబ్ సమీపంలో నివాసముంటున్న గంగయ్య కుమారుడు వెంకటేష్‌ను అదుపులో తీసుకుని తహసీల్దార్ జయరామయ్య సమక్షంలో విచారంచామని చెప్పారు. వెంకటేష్ వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. గత ఏడాది తమిళనాడులోని కొయ్యూరు పొలీస్ స్టేషన్‌లో మత్తుపదార్థాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వెంకటేష్ నిందితుడుగా ఉన్నాడని సీఐ రవీంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment