ద్వారకా నగర్ కాజ్‌వేపై వరద ఉధృతి
నాగలాపురం: మండలంలోని ద్వారకానగర్ కాజ్‌వేపై వరద ఉధృతి పెరిగింది. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు నీటి మట్టం 29 అడుగులకు చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ద్వారకానగర్ కాజ్‌వేపై వరద ఉధృతి పెరిగింది. పిచ్చాటూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం
తిరుపతి రూరల్: 6వ అంతర్ జిల్లాల బాడీ బిల్డింగ్ పోటీల్లో చంద్రగిరి మండలం, ముంగిలిపట్టు గ్రామానికి చెందిన జాగర్లమూడి నవీన్ బంగారు పతకం సాధించాడు. ఆదివారం తిరుపతిలో జరిగిన పోటీల్లో 75 కిలోల విభాగంలో నవీన్ తన శరీర సౌష్టవంతో అద్భుత ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. తిరుపతిలోని హెచ్‌కే ఫిట్‌నెస్ సెంటర్‌లో శిక్షణ పొందిన నవీన్‌ను జీమ్ కోచ్ హరికృష్ణ, తిరుపతి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్‌ప్రకాష్, ప్రవీణ్, యూనస్‌బాషా, శివప్రసాద్ అభినందించారు.
అ‘ద్వితీయం’
శ్రీకాళహస్తి: బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన షేక్ సమద్ ప్రతిభచాటి ద్వితీయ బహుమతి సాధించాడు. తిరుపతిలో సోమవారం జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచి పలువురు పోటీపడ్డారు. అందులో షేక్ సమద్ అత్యుత్తమ ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా పలువురు అతనిని అభినందించారు.
ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
తిరుపతి రూరల్: ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ బిల్లుల చెల్లింపులను మరింత సులభతరం చేయడంలో భాగంగా విద్యుత్ బిల్ చివరన క్యూ ఆర్ కోడ్‌ని ప్రవేశపెట్టిందని, కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో బిల్లులను చెల్లించవచ్చని తిరుపతి సబ్ డివిజన్–1 డీఈ ఆంజనేయులు తెలిపారు. సోమవారం తిరుపతిలో క్యూర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధానంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment