అమ్మవారికి సారె సమర్పణ
తిరుపతి రూరల్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతీ అమ్మవారికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు ఆధ్యాత్మిక పాదయాత్రను నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక పాదయాత్ర వైభవంగా సాగింది. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాదయాత్రలో చెవిరెడ్డి వెంట నడిచారు. ప్రతి ఏటా అమ్మవారికి నిర్వహించే కార్తీక బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గజవాహన సేవకు, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు చెవిరెడ్డి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలను తీసుకుని పాదయాత్రగా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు తుమ్మలగుంట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చెవిరెడ్డి సారె తీసుకుని తిరుచానూరుకు పాదయాత్రగా బయలు దేరారు. అనంతరం తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి తన వెంట వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆపై ఆలయాధికారులకు సారెను అందించారు. ఈ ఆధ్యాత్మిక పాద యాత్ర గాంధీపురం, అవిలాల, లింగేశ్వర నగర్, సాయినగర్, శ్రీనివాస పురం, పద్మావతీ పురం మీదుగా తిరుచానూరు వరకు సాగింది. పాదయాత్ర తిరుచానూరులోకి ప్రవేశించగానే సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ వేముల యశోద, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, భక్తులు అపూర్వ స్వాగతం పలికారు.
అశేష భక్తజనం మధ్య ఆధ్యాత్మిక పాదయాత్ర
పద్మావతీ అమ్మవారికి
పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి
వందలాదిగా తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment