బంగారు గొలుసు అప్పగింత
శ్రీకాళహస్తి: పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి భక్తులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు ముక్కంటి ఆలయ సిబ్బంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్వనానికి పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులు వచ్చారు. దర్శనం సమయంలో వారు బంగారు చైన్‌ను పోగొట్టుకున్నారు. అనంతరం ఆ బంగారు గొలుసును ఆలయ ఉద్యోగులు గుర్తించారు. బాధితులు తమ గొలుసు పోయినట్లు ఆలయ ఉద్యోగులకు విన్నవించారు. వారు సీసీ పుటేజీ ద్వారా నిర్ధారించి వారి బంగారు గొలుసు తిరిగి వారికి అప్పగించారు. దీంతో వారు ఆలయ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఉద్యోగులు ప్రవీణ్‌కుమార్, ఉమాపతి, ఎల్లారెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శిగా నాగరాజు
సత్యవేడు: తిరుపతి జిల్లా సీపీఎం కార్యదర్శిగా వందవాసి నాగరాజు ఎన్నికయ్యారు. సోమవారం సత్యవేడులో జరిగిన సీపీఎం 14వ మహాసభ సందర్భంగా ఆయన్ను రెండో పర్యాయం జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, టీ.సుబ్రమణ్యం, దాసరి జనార్దన్. కమిటీ సభ్యులుగా భగత్ సాయిలక్ష్మి, జయచంద్ర, మాధవ్, ఆర్.వెంకటేశ్, హరినాఽథ్, వేణుగోపాల్, బీ.రవి, ఆర్.లక్ష్మి, జోగి రవికుమాలు ఎన్నికయ్యారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్: పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 55 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గత నాలుగు రోజులుగా గాంఽధీపార్కు సమీపంలో ఉంటుండేవాడన్నారు. ఆదివారం ఓ దుకాణం పక్కన నిద్రపోయాడు. చలికి తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి చూసేసరికే అతను మృతి చెందినట్లుగా సిబ్బంది నిర్ధారించారు. మృతుడు ఆకుపచ్చ, తెలుపు గళ్లు కలిగిన ఫూల్ హ్యండ్ చొక్కా, బ్లూకలర్ జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment