అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం

Published Tue, Dec 3 2024 1:24 AM | Last Updated on Tue, Dec 3 2024 1:24 AM

అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం

అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం

● వాహనసేవలో తరిస్తున్న శ్రీరంగం శ్రీవైష్ణవులు

చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు. శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు 32 ఏళ్లుగా విశేష సేవందిస్తున్నారు. ఒక్కో వాహనాని మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు. వీటన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది. ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతున్నారు. శ్రీ కాంతన్‌ నేతృత్వంలో 32 ఏళ్లుగా అమ్మవారి వాహనసేవ కై ంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. వీరు మొత్తం 52 మంది ఉన్నారు. వీరు చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వీరు వాహనం మోసేటప్పుడు, వారి నడకలో నాలుగు రకాలైన విధానాలు పాటిస్తారు. తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు, వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్మయత్వం చెందుతారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చేస్తారు. వీరికి టీటీడీ ఉచితంగా బస, భోజనం కల్పించి, వస్త్ర బహుమానం, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తోంది. వాహనసేవకులు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement