ఎస్వీయూలో అన్యమత ప్రచారం!
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈఈఈ విభాగపు ప్రొఫెసర్ చెంగయ్య అన్యమత ప్రచారం చేస్తున్నారన్న సమాచారం వర్సిటీలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక భజరంగ్‌దళ్ కార్యకర్తలు కళాశాలలోని ఆయన చాంబర్‌లోకి వెళ్లి విచారించగా ఓ మతానికి చెందిన పుస్తకాలు ఆయన కార్యాలయంలో తారసపడ్డాయి. దీంతో ఆగ్రహించిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆయనను తన చాంబర్ నుంచి కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు నెట్టారు. కళాశాల ఆవరణలో పార్కింగ్ చేసిన ఆయన కారుపై దాడిచేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ప్రస్తుతం వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అధ్యాపకుడు చెంగయ్యపై విచారణ కొనసాగుతోంది.
అన్యమత ప్రచారంపై విచారణ
ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈఈఈ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ చెంగయ్య వర్సిటీలో అన్యమత ప్రచారం చేసినట్లు సమాచారం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వీసీ సీహెచ్ అప్పారావు పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ నిమిత్తం కమిటీని నియమించామని, నివేదిక ప్రకారం వర్సిటీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ చెంగయ్య మాట్లాడుతూ తాను ఎటువంటి అన్యమత ప్రచారం చేయలేదన్నారు. కొందరు కావాలనే తనపై కక్ష పూరితంగా వ్యవహిరిస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment