ముంచేసిన ఫెంగల్
● వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి ● కొన్నిచోట్ల వరద ఉధృతికి కొట్టుకుపోయిన వరినాట్లు ● నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్న వైనం ● ఆందోళనలో అన్నదాతలు ● నష్టం అంచనాలో అధికారులు
చిట్టమూరు మండలంలో నీటమునిగిన వరినాట్లు
అన్నదాత కష్టం నీటిపాలైంది. పెంగల్ తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరినాట్లు వేయగా.. అందులో సగానికిపైగా పంట దెబ్బతింది. మిగిలిన పంట నాలుగైదు రోజులుగా నీటిలోనే నానుతుండడంతో పాచిపోయి.. పనికిరాకుండా పోతోంది. వడ్డీలకు తెచ్చి పెట్టిన పెట్టుబడులు కొట్టుకుపోయాయని రైతాంగం కన్నీటిపర్యంతమవుతోంది. పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఫెంగల్ తుపాను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చిరు జల్లులతోపాటు.. కుండ పోత వానతో అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా ఈ రబీ సీజన్‌లో 2.2 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు. అయితే ఇప్పటికే లక్ష ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. డిసెంబర్ చివరికల్లా మరో 1.2 లక్షల ఎకరాల్లో వరిపంట సాగులోకి రానుంది. ఈ క్రమంలో ఫెంగల్ తుపాను కారణంగా ముందస్తుగా సాగు చేసిన వరినాట్లకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పరిశీలిస్తూ..నష్టాన్ని అంచనా వేస్తూ..
జిల్లాలోని ఆయా విభాగాలకు చెందిన అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఓ వైపు వ్యవసాయశాఖ అధికారులు ఎంత మేరకు వరి పంటతోపాటు వేరుశనగ, మినుములు, పెసల పంటలు నీట మునిగాయో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నా రు. అలాగే ఉద్యానశాఖ అధికారులు కూరగాయల పంటలతోపాటు పలు వ్యాపార, వాణిజ్య పంటల నష్టాన్ని లెక్కలు కడుతున్నారు. ఇంకో వైపు మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, సెరికల్చర్ అధికారులు అదేబాట పట్టారు. ఇరిగేషన్ అధికారులు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు తమకు వచ్చిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి మండలాల వారీగా లెక్కలు కడుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపనున్నారు.
నీట మునిగిన పంటల పరిశీలన
సూళ్లూరుపేట : మండలంలో నీటమునిగిన పంట పొలాలను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. సూళ్లూరుపేట గోకులకృష్ణా ఇంజినీరింగ్ కళాశాల వద్ద కాళంగి వరద ఉధృతికి పంట పొలాలు మునిగాయి. అలాగే పడమట కండ్రిగ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న నీటితో పాటు మునకలో ఉన్న పొలాలను ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలో సుమారు 150 ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయని ఏఓ కవిత కలెక్టర్‌కు వివరించారు. కాళంగినది, పాములకాలువ రెండు రైల్వేట్రాక్‌లకు ముందు కలుస్తున్న నేపథ్యంలో వరదనీరు వెనక్కి ఒత్తిడి పెరగడం వల్ల పడమటకండ్రిగ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోందని తెలిపారు. అలాగే వట్రపాళెం మునుగుతుందని తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్‌ఈ మదనగోపాల్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ పాములకాలువ, కాళంగినది కలిసే వై పాయింట్‌ను పరిశీలించారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం మండలం, సంతవేలూరు చెరువు కట్ట బలహీనంగా ఉండడంతో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదారు రోజుల నుంచి సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తడ, వరదయ్యపాళెం, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఎక్కడైతే రోడ్లు, చెరువులు తెగిపోయాయో వాటిని గుర్తిస్తున్నామని, అలాగే నీట మునిగిన పంటనష్టాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన వేయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment