ఉపాధ్యాయులే మూలస్తంభాలు
తిరుపతి ఎడ్యుకేషన్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత దేశంలో సామాజిక అభివృద్ధికి ఉపాధ్యాయులే మూల స్తంభాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఆదివారం యూటీఎఫ్ తిరుపతి జిల్లా శాఖ స్వర్ణోత్సవ మహాసభలు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జీజే రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. అనేక స్కూళ్లు మూతపడ్డాయని, చాలాచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఓ పక్క శాస్త్ర సాంకేతిక నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలుగా విద్యా విధానాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు, ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు కనమరుగయ్యే అనేక రకాల కార్యక్రమాలను విద్యావ్యవస్థలో ప్రవేశ పెడుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో సామాజిక స్పృహ కలిగిన యూటీఎఫ్ కార్యకర్తలు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండ కట్టాలని, వాటి బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యం సాధించడానికి విద్యావ్యవస్థలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వ చొరవచూపాలన్నారు. అంతకుముందు బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు పెద్ద ఎత్తున్న యూటీఎఫ్ నాయకులు స్వర్ణోత్సవ ర్యాలీ నిర్వహించారు.
కలంకారీ.. మనసు దోచెనే..
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసిన కొందరు అమెరికన్లకు కలంకారీ వస్త్రాలు నచ్చాయి. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కొందరు విదేశీయులు శ్రీకాళహస్తి ప్రఖ్యాత కళ అయిన కలంకారీ దుస్తులు కొనడానికి బానోదయ కలంకారీ సంస్థకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు కలంకారీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనేక వస్త్రాలను కొనుగోలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ఆర్ట్ లేదని వారు కొనియాడారు.
గణితం టాలెంట్ టెస్టుకు స్పందన
తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని విశ్వం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ ఇండెలిబ్ మ్యాథ్‌మెటిక్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టుకు విశేష స్పందన లభించింది. తిరుపతి జిల్లా నలుమూలల నుంచి 5–8వ తరగతి చదివే విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచడం, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడమే ఈ టాలెంట్ టెస్టు లక్ష్యమని విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి తెలిపారు.
జిల్లా స్థాయిలో విద్యార్థిని జాహ్నవి ప్రతిభ
శ్రీకాళహస్తి రూరల్: మండలం ఊరందూరు జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వై.జాహ్నవి రాష్ట్ర పౌర సరఫరా శాఖ వారు నిర్వహించిన శ్రీవినియోదారుల సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు–వాటి వినియోగం్ఙ అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థిని జాహ్నవికి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాజకుమారి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన తమ విద్యార్థి జాహ్నవి 24న వినియోగదారుల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరగనున్న పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment