జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపిక
కోట: జాతీయ స్థాయి జూడో పోటీలకు చిట్టేడు ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థి టీ.సంతోష్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శేషవర్దన్ శుక్రవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి సంతోష్ గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో డిసెంబర్ 27 నుంచి మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 80 కిలోల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్టు తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. జూడో పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని ప్రిన్సిపల్‌తోపాటు పీడీ సత్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
రుయాలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
తిరుపతి క్రైం: తిరుపతి రుయా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసుల కథనం.. రుయా హాస్పిటల్ సమీపంలోని ఓ నిర్మాణ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పడిపోయినట్లుగా సమాచారం వచ్చింది. అయితే అక్కడ స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడి ఆచూకీ లభ్యం కాలేదు. అనారోగ్యంతో మృతి చెందాడా.. లేదా ఏదైనా ఇతర ఘటనలు చోటుచేసుకున్నాయా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
గాయపడిన వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): రేణిగుంట మండలం, మర్రిగుంట సమీపంలోని జాతీయ రహదారిపై 30వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని నల్లపాళెం గ్రామానికి చెందిన ప్రసాద్ (44), అలివేలు (35) భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మర్రిగుంట సమీపంలోని పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై 30వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇరువురినీ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ (44) శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు గాజులమండ్యం పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలివేలు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. భర్త మృతిచెందడంతో భార్య అలివేలు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఈ దంపతులకు చంద్రశేఖర్, సోమశేఖర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యార్థిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment