లేరు సాటి.. నత్తే నాకు పోటీ!
● ఆరేళ్లుగా సా..గుతున్న ఇంటింటికీ తాగునీటి పనులు
● మున్సిపాలిటీల్లో అరకొర నీరే గతి
● రూ.288.10 కోట్లతో ప్రారంభమైన పనుల సంగతేంటో?
● అయోమయంలో జిల్లా వాసులు
సూళ్లూరుపేట: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీరు కలగా మిగిలింది. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏషియన్ ఇన్విస్టిమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు రూ.288.10 కోట్లు మంజూరు చేయించింది. తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి నీళ్లు తెప్పించి తాగునీటి కొరత తీర్చే దిశగా ప్రణాళిక రూపొందించింది. 2019లో అప్పటి మంత్రి నారాయణ సూళ్లూరుపేట మున్సిపాలిటీకి రూ.142.10 కోట్లు, నాయుడుపేట మున్సిపాలిటీగా రూ.146 కోట్ల మంజూరైనట్టు శిలాఫలకాలు వేశారు. ఆ తర్వాత తూతూమంత్రంగా పనులను ప్రారంభించారు. ప్రస్తుతం పనులైతే ఇంకా చేస్తూనే ఉన్నారు.
నీటి కోసమే రోజుకు రూ.2.5 కోట్లు ఖర్చు
తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో చాలీచాలకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల వారు మున్సిపల్ నీటికోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో క్యాన్ వాటర్, ట్రాక్టర్లల ద్వారా తీసుకొచ్చే లూజ్ వాటర్ బిందెనీళ్లు రూ.8 పెట్టి కొంటున్నారు. క్యాన్ వాటర్‌కు రూ.25 వెచ్చిస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నీటి కోసమే రూ.50 లక్షల దాకా వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కలిపి రోజుకు నీటి కోసం రూ.2.5 కోట్లు ఖర్చుచేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇదే అదునుగా వాటర్ కంపెనీలు నాణ్యత లేకుండా, ఐఎస్‌ఐ మార్కు లేకుండా నీళ్ల వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
మంగళంపాడు చెరువుకు గంగ నీరు
బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి పైపులైన్ ద్వారా సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు చెరువులో సమ్మర్ స్టోరేజ్‌కి నీళ్లు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. సమ్మర్ స్టోరేజీకి అనుసంధానంగా నీటి శుద్ధి చేసేందుకు ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనులు మందకొడిగా సాగుతున్నాయి. బుచ్చినాయుడుకండ్రిగ నుంచి సూళ్లూరుపేట దాకా 25 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులను పూర్తి చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిర్మాణ పనుల్లో జాప్యం
సూళ్లూరుపేట మున్సిపాలిట పరిధిలో మన్నారుపోలూరు మిట్టమీద 9 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్‌హెడ్ ట్యాంక్, సూళ్లూరు దళిత వాడలో 3 లక్షలు, కళాక్షేత్రంలో 12 లక్షలు, ఇసుకమిట్టలో 11 లక్షలు కెపాసిటీ ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. కానీ ఈ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
నాయుడుపేటలోనూ ఇదే పరిస్థితి
నాయుడుపేట పట్టణంలో తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి డైరెక్ట్ పైపులైన్‌ల ద్వారా నాలుగు సమ్మర్ స్టోరేజీల్లో నీళ్లు నింపుకుని పట్టణానికి అందించాలన్నదే లక్ష్యం. తెలుగుగంగ కాలువ నుంచి పైపులైన్‌ల పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పట్టణంలో మాత్రం ఇంటింటికీ కొళాయిలైతే వేశారు. బీఎంఆర్ నగర్, స్వర్ణముఖినది ఒడ్డున, డీఎస్పీ కార్యాలయం సమీపంలో, పాత తహసీల్దార్ కార్యాలయ సమీపంలో నాలుగు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే ఇప్పటి దాకా ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మాణమే ప్రారంభం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment