● కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ● రెండోరోజు పోటెత్తిన
వలస పక్షులను వీక్షించేందుకు వందలాదిగా పర్యాటకులు తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో పోటెత్తారు. విదేశీ విహంగాల సందడిని పరిశీలించి పరవశించారు. ఉత్సాహంగా బోటులో షికారు చేసి మురిసిపోయారు. ఆహ్లాదకర వాతావరణంలో పక్షుల కిలకిలరావాల నడుమ సేదతీరారు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలను తిలకించి క్రీడాకారులను అభినందించారు.
సూళ్లూరుపేట : ఫ్లెమింగో ఫెస్టివల్–2025కు రెండోరోజు ఆదివారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సందర్శకులు, స్కూల్ విద్యార్థులు తరలిరావడంతో ఇటు సూళ్లూరుపేట, అటు నేలపట్టు పక్షుల కేంద్రం, భీములవారిపాళెం పడవల రేవు, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞానకేంద్రం జనాలతో కిక్కిరిసింది. ముందుగా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ స్టాల్స్, రంగులరాట్నాలు ఏర్పాటు చేయడంతో సందర్శకులు తాకిడి ఎక్కువగా కనిపించింది. అటకానితిప్ప పర్యావరణ విజ్ఞానకేంద్రంలో పర్యాటకులు పక్షులకు సంబంధించి ఫిల్మ్‌షో వీక్షించారు. అలాగే మ్యూజియం చూసేందుకు బారులు తీరారు. ముఖ్యంగా నేలపట్టులో పక్షులను వీక్షించేందుకు, భీములవారిపాళెం పడవల రేవులో బోట్ షికారు చేసేందుకు అధికంగా ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. శ్రీహరికోట– సూళ్లూరుపేట మార్గంలో ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనులవిందు చేశాయి. సరస్సులో నీరు తక్కువగా వుండడంతో పక్షులు రోడ్డుకు పక్కనే గుంపులు గుంపులుగా దర్శనమివ్వడంతో పర్యాటకులు ఆశ్చర్యానందానికి గురయ్యారు. నేలపట్టు పక్షులు కేంద్రంలో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, తెల్ల కంకణాయిలు, తెడ్డుముక్కుకొంగలు, పలు రకాల బాతు జాతి పక్షుల సందడి ఆకట్టుకుంటోంది.
ఉచిత బస్సులు
సూళ్లూరుపేటకు వచ్చిన పర్యాటకులు నేలపట్టు, అటకానితిప్పకు, భీములవారిపాళెం పడవల రేవు, శ్రీసిటీ పారిశ్రామికవాడకు వెళ్లేందుకు ఉచితంగా బస్సులు నడిపారు. ఇందుకోసం స్థానిక స్కూళ్లు, కళాశాలలకు చెందిన ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఖర్చులు కూడా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలే భరించినట్లు తెలిసింది.
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులు షార్ సందర్శనకు అవకాశం లేకుండా పోయింది. ఈనెల 29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 ప్రయోగించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల షార్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో పర్యాటకులు బయట నుంచే షార్ కేంద్రం ఫొటోలు తీసుకుని వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment