కుమ్ములాటలో మునగంగ!
● తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ కోసం నున్వా.. నేనా? ● జనసేనకు ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు ● టీడీపీకే చైర్మన్ పదవి అంటూ నేతల హడావుడి ● టీడీపీలో ఏకంగా ఐదుగురు పోటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసం కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తార స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే జనసేన అభ్యర్థికి ఇచ్చాము కదా.. తుడా, గంగమ్మ ఆలయ చైర్మన్ పదవులు టీడీపీ నేతలకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఆలయ చైర్మన్ పదవి కోసం టీడీపీ నుంచి ఐదుగురు పోటీపడుతుంటే.. జనసేన నుంచి ఒకే ఒక్కరు పేరు వినిపిస్తోంది. జనసేనను నమ్ముకుని ఉన్న హరిశంకర్‌కు ఇప్పించేందుకు ఆ పార్టీ నాయకులంతా పట్టుబడుతున్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హరిశంకర్‌కి మద్దతు తెలియజేసినట్లు సమాచారం. హరిశంకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జనసేనలో కమ్మ సామాజిక వర్గం నాయకుల్లో ఒకే ఒక్కడు హరిశంకర్. అతిముఖ్యమైన టీటీడీ చైర్మన్ టీడీపీ సూచించిన వ్యక్తికే ఇచ్చారు కాబట్టి.. తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తాతాయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ పదవిని మాత్రం జనసేనకే కేటాయించాలని ఎమ్మెల్యేతో పాటు, ఆ పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్‌రాయల్, మిగిలిన వారంతా పట్టుబడుతున్నారు. ఇందుకు టీడీపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. అందులో భాగంగా శనివారం టీడీపీ నేతలు ఎవరికి వారు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ అని ప్రచారం చేసుకున్నారు. అలా ప్రచారం చేసుకుంటున్న వారిలో ఆనందబాబు యాదవ్, ఆర్సీ మునికృష్ణ, తులసీరాం, బుజ్జిబాబు నాయుడు ఉన్నారు. గంగమ్మ ఆలయ చైర్మన్ యాదవ సామాజిక వర్గం వారికి కేటాయించాలని కొందరు పట్టుబడుతున్నారు. అదే విధంగా కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పోటీలో ఎవరికి అమ్మవారు వరమిస్తారోనని తిరుపతి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment