కొట్లాట ఖనిజం!
● మైన్స్ కోసం పోటీపడుతున్న ప్రజాప్రతినిధులు ● తల పట్టుకుంటున్న లీజు పొందిన స్థల యజమాని
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు తెల్లరాయి మైన్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయిని ఒక్కరే చేజిక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటే.. తమ ప్రాంతంలోని మైన్లపై మరొకరి పెత్తనం ఏంటి..? అని గూడూరుకు చెందిన ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన పరిధిలోని మైన్‌లు తమకే ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజు పొందిన యజమాని తన 10 ఎకరాల పట్టా భూమిలోని మైన్‌ను ఎవరికి ఇవ్వాలనే మీమాంసలో పడిపోయారు. ఇది గూడూరు రూరల్ ప్రాంతంలోని ఓ తెల్లరాయి మైన్ కథ.
నువ్వా..నేనా?
గూడూరు రూరల్ ప్రాంతంలోని తన సొంత పట్టా భూమిలో తెల్లరాయి ఉందని తెలుకున్న యజమాని రెవెన్యూ, గనుల శాఖాధికారుల నుంచి 10 ఎకరాలలో తవ్వకాలు చేపట్టేలా అనుమతులు పొందాడు. తవ్వకాలకు పూర్తిగా అనుమతులు మంజూరు చేసిన తరువాత సొంతగా వ్యాపారం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే దీనిపై కన్నెసిన స్థానిక ప్రజాప్రతినిధి మైన్ యజమానితో మంతనాలు జరిపారు. మైన్‌ను తనకు అప్పగించేలా ఒప్పందం చేసేకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలోని సైదాపురం ప్రాంతంలో ఉన్న తెల్లరాయి మైన్‌లను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి అప్పగించేలా ప్రభుత్వంలోని పెద్దలు సన్నాహాలు చేస్తుండగా గూడూరు ప్రాంతంలోని మైన్‌లను కూడా ఆయనకే కట్టబెట్టాలని నిశ్చయించారు. ఆ ప్రజాప్రతినిధి ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో సహాయ సహకారాలు అందించి ఉండవచ్చుగానీ ఎన్నికల అనంతరం కూడా ఈ ప్రాంతంలోని సహజ సంపదపై పట్టు సాధించాలనుకుంటే పార్టీని నమ్ముకుని ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తల మాట ఏంటని స్థానిక ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక మైన్ విషయంలో నువ్వా– నేనా అన్నట్టు కూటమి ప్రభుత్వంలోని ఇద్దరి ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ముదిరింది. దీంతో లీజు పొందిన మైన్ యజమాని ఎటూ తెల్చుకోలేక సతమతమవుతున్నట్టు సమాచారం. వ్యాపారాలు చేసుకునే వారిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని తన సన్నిహితుల వద్ద ఆయన వాయిపోయినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పెద్దలు అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారని గగ్గోలు పెట్టి నేడు మాత్రం ఇలా మైన్‌ల యజమానులను భయపెట్టి, బుజ్జగించి వారి వద్ద నుంచి తీసుకోవడం, కాకుంటే భాగస్వామ్యం ఇవ్వాలని పట్టుబట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెల్లరాయి తరలింపు పూర్తి అనుమతులు వస్తే అధికార కూటమి ప్రభుత్వంలో ఎవరికి వారు యమునా తీరే అనేలా నడుచకుంటారా, ప్రభుత్వంలోని పెద్దలు అప్పగించిన వారికే కట్టబెట్టి వారు ఇచ్చింది తీసుకుంటారో..? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment