పేద విద్యార్థులతో చెలగాటమా?
● ఉన్నత విద్య అందించేందుకే ఫీజురీయింబర్స్‌మెంట్ ● కూటమి ప్రభుత్వం వచ్చాక తూట్లు ● 5న ఫీజు పోరు ● పోస్టర్ ఆవిష్కరించిన భూమన అభినయ్, మేయర్ శిరీష
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద శుక్రవారం ఫిబ్రవరి 5వ తేదీన చేపట్టనున్న ఫీజుపోరు పోస్టర్‌ను నాయనతోపాటు మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అభినయ్ మాట్లాడుతూ కేవలం అధికార దాహంతో చంద్రబాబు నోటికొచ్చినట్లుగా అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదన్నారు. అమ్మకు వందనం, ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో పేద విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. జగనన్న ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించేలా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపోరు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, తండ్రి ఆశయాలకు అనుగుణంగా అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలను జగనన్న అందిస్తూ పేద విద్యార్థుల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా చేస్తోందన్నారు. కార్పొరేటర్ ఎం.శేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, ఉదయ్‌వంశీ, ఇమ్రాన్‌బాషా, అనీల్, కోదండ, సాయికుమారి, మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment