విధ్వంసం
ఇసుక రీచ్ కోసం
● వరి పైర్లు ధ్వంసం ● అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు
పెళ్లకూరు: ఇసుక రీచ్ కోసం అధికారులే విధ్వంసానికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరి పైర్లను సైతం లెక్కచేయక యంత్రాలతో ధ్వంసం చేయడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ కోసం నదీ తీరంలో ఉన్న వరి పైర్లను శనివారం అధికారులు యంత్రాలతో ధ్వంసం చేశారు. స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ కోసం నాలుగు నెలల కిందట డివిజన్ స్థాయి రెవెన్యూ యంత్రాంగం కలవకూరు, పుల్లూరు, తాళ్వాయిపాడు, పాలచ్చూరు తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. కానీ ఇసుక రీచ్‌కు స్వర్ణముఖినదిలో ఏ ప్రాంతం వద్ద కేటాయిస్తారు అనే విషయమై స్పష్టత లేదు. అయితే గత ఏడాది నవంబర్ నుంచి కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహం అధికంగా ఉంది. అందువల్ల రీచ్ ఏర్పాటును అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల వరద ఉధృతి తగ్గడం, ఇసుక రీచ్ కోసం అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి బిడ్ కేటాయించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. రెండు రోజుల కిందట సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి కలవకూరు వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు కోసం మరోమారు పరిశీలించారు. వెనువెంటనే నదీ తీరంలో ఉన్న పచ్చని వరి పైర్లను యంత్రాలతో ధ్వంసం చేయించి రీచ్ కోసం రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా అధికార పార్టీ పెద్దల కోసం పచ్చని పరిపైర్లు యంత్రాలతో ధ్వంసం చేయడంపై పలువురు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ స్పందించి కలవకూరు వద్ద ఇసుక రీచ్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అన్యాయం
రైతులు స్వర్ణ ముఖి నదీ తీరంలో సుమారు వందేళ్లుగా 150 ఎకరాల అనాధీనం భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడు వరి పైర్లు నాటారు. కలవకూరు, పుల్లూరు గ్రామాల్లో వేల ఎకరాలకు స్వర్ణముఖినది జీవనాధారం. అధికార పార్టీ నేతకు రీచ్ ఏర్పాటు చేయడం కోసం రేపోమాపో చేతికందే వరి పంటను యంత్రాలతో తొక్కించి ధ్వంసం చేయడం అన్యాయం.
– చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి,
ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment