లగచెర్ల, పులిచెర్లకుంట తండా, రోటిబండ తండా తెరుచుకోని ఇళ్లు
16 మంది అనుమానితులకు 14 రోజుల రిమాండ్
దుద్యాల్: వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని లగచెర్ల, పులిచెర్లకుంటతండా, రోటిబండతండాల్లో భయనక పరిస్థితులే పరిస్థితులే కొనసాగుతున్నాయి. అధికారులపై దాడి ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. సోమవారం దాడి తర్వాత ఆయా గ్రామాలకు చెందిన సుమారు 55 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. వీరిలో 39 మందికి ఘటనతో ఏమాత్రం సంబంధం లేదని గుర్తించారు. మిగిలిన 16 మందిని అనుమానితులుగా నిర్ధారించి, మంగళవారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మిగిలిన 39మందిని పోలీసులు వారివారి గ్రామాల్లో వదిలేశారు.
వివరాలు తీసుకున్నారు..
దాడిలో పాల్గొనని వ్యక్తులను కూడా పోలీసులు తీసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గత సోమవారం రాత్రి గ్రామాలను చుట్టుముట్టిన పోలీసులు అందరూ అనుమానితులే అనే ఉద్దేశంతో కనిపించిన వారినల్లా లాక్కెళ్లారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. ఫార్మాలో తమ భూములు పోతలేవని, ధర్నాలలో పాల్గొనలేదని పోలీసులకు చెప్పామన్నారు. దీంతో పూర్తి వివరాలు తీసుకుని ఎలాంటి షరతులు లేకుండా విడిచిపెట్టారన్నారు. ఇదిలా ఉండగా కేవలం లగచెర్లకు చెందిన వారిని మాత్రమే వదిలేశారని, రోటిబండతండా, పులిచెర్లకుంటతండా గ్రామాల గిరిజన రైతులను ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వీరంతా భయం నుంచి తేరుకోలేదు.
డెలివరీ సమయమని చెప్పినా వినలేదు
పులిచెర్లకుంటతండాకు చెందిన ప్రవీణ్, జ్యోతి దంపతులు. ప్రస్తుతం జ్యోతి నిండు గర్భిణి. పోలీసులు వచ్చి తన భర్తను తీసుకెళ్తుండగా.. తనకు డెలివరీ సమయం ఉందని కాళ్లు మొక్కినా పట్టించుకోలేదని వాపోయింది. తాను ఆస్పత్రికి వెళ్లాలని, రెండు రోజులుగా నిద్రాహారాలు లేవని కన్నీరు కార్చింది. ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నాని వెంటనే తన భర్తను వదిలేయాని కోరింది.
నాకొడుకు దాడిలో లేడు..
రోటిబండతండాకు చెందిన సోనీబాయికి ఏకై క కొడుకు బాస్యనాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. సోమవారం జరిగిన ఘటనతో తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదని, ఆరోజు మేకలు తోలుకొని అడవికి వెళ్లాడని ఎంతచెప్పినా పోలీసులు పట్టించుకోలేదని కన్నీరుమున్నీరవుతోంది. తనకు కళ్లు కనిపించవని, వండుకునే పరిస్థితి కూడా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. దాడిలో పాల్గొనని తన కొడుకును విడిచిపెట్టాలని రోదించింది.
Comments
Please login to add a commentAdd a comment