ప్రాణాలు పోతున్నా పట్టదా?
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు కాలయాపన చేస్తుండడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చేవెళ్లలో మంగళవారం ధర్నాకు దిగారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, అనంత్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి, సీపీఐకి చెందిన కె.రామస్వామి సత్తిరెడ్డి, సీపీఎంకు చెందిన దేవేందర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన శైలజ, సమత, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నా కోర్టు కేసులు అంటూ జాప్యం చేస్తారా అంటూ నిలదీశారు. ఎన్‌జీటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కేసు వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని, దీనిపై మంత్రులు కానీ అధికారులు కానీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ చంద్రకళ అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పనులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ, పరిహారం పంపిణీ పనులు దాదాపు పూర్తయ్యాయని, రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తేజ అనే వ్యక్తి కేసు వేయడంతో ఆలస్యమైందన్నారు. దీనిపై నేషనల్ హైవే అధికారులు కూడా అప్పీల్ చేశారని ఈనెల 16న కేసు వాయిదా ఉందని తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం అఖిలపక్ష నేతలు గ్రీన్‌ట్రిబ్యూనల్‌లో కేసు వేసిన తేజపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో సీఐ భూపాల్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. చేవెళ్ల ఏసీపీ కిషన్, నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది మోహరించారు.
ఆలూరు బస్‌స్టేజీ వద్ద ఆందోళన
లారీ ప్రమాదం చోటు చేసుకున్న ఆలూరు బస్‌స్టేజీ వద్ద గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. చేవెళ్ల వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వీరికి బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ్రప్రద్ పటేల్ మద్దతు తెలిపారు. ఆర్డీఓ చంద్రకళ వారిని సైతం సముదాయించి పంపించారు.
ఇంకెంత కాలం నిర్లక్ష్యం
వెంటనే రోడ్డు విస్తరణ చేపట్టండి
అఖిలపక్షం నాయకుల డిమాండ్
హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ధర్నా
Comments
Please login to add a commentAdd a comment