‘ఆధారం’ లేదని వైద్యం నిరాకరణ!
మానవత్వం మరిచిన జిల్లా ఆస్పత్రి వర్గాలు
● 25 రోజులుగా దవాఖానాఎదుట పడిగాపులు కాస్తున్న అభాగ్యుడు ● కాలికి ఇన్‌ఫెక్షన్ సోకి పురుగులు పట్టిన వైనం
తాండూరు టౌన్: ఆధార్ కార్డు లేదు.. ఆస్పత్రిలో చేర్చుకుంటే నిన్ను చూసుకునే వారు లేరు అని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు ఓ వ్యక్తికి వైద్యం నిరాకరించాయి. దీంతో ఓ అభాగ్యుడు 25 రోజులుగా దవాఖానా ఎదుట పడిగాపులు పడుతూ సాయం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. మానవత్వం మరిచిన ఆస్పత్రి వర్గాలపై స్థానికులు మండిపడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నాటక రాష్ట్రం చించోళి ప్రాంతానికి చెందిన శివకుమార్ తాండూరులో ఒంటరిగా ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఎడమ కాలికి దురద పెట్టడంతో చేతితో గోకాడు. దీంతో చీము, నెత్తురు కారడం మొదలైంది. చికిత్స నిమిత్తం 25 రోజుల క్రితం జిల్లా ఆస్పత్రికి వెళ్లగా ఆధార్ కార్డు లేదని, ఆస్పత్రిలో చేర్చుకుంటే బాగోగులు ఎవరు చూస్తారని..? నిరాకరించారు. కదలలేని స్థితిలో ఉన్న శివకుమార్ అక్కడక్కడే గడుపుతున్నాడు. పలుమార్లు ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా.. అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో పురుగులు పడి కాలు కొట్టేసే పరిస్థితికి చేరుకుంది. అతని దీనస్థితిని చూసిన పలువురు స్థానికులు ఆస్పత్రి వర్గాలకు మొరపెట్టినా కనికరించలేదు. పైగా అతన్ని ఆస్పత్రిలో చేర్చుకుంటే నీవు వెంట ఉంటావా..? అని ఎదురు ప్రశ్నించారని పలువురు ఆరోపించారు. అయితే తాను అతనికి తోడుగా ఉంటానని చెప్పినా కూడా పట్టించుకోలేదని ఓ స్థానికుడు అసహనం వ్యక్తంచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment