అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ
సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
చందానగర్: అవగాహనతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రాజెక్ట్ ‘ప్రొటెక్ట్’ (ప్రివెటింగ్ రిస్క్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొలాబొరేషన్స్ అండ్ ట్రైనింగ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. 2016 నుంచి 2024 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.700 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఈ సంవత్సరం రూ.74 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ వారియర్స్, ఎస్సీఎస్సీ, సంగమిత్ర, దిల్‌సే వివిధ స్వచ్ఛంద సంస్థల వలంటీర్లతో ఈ నెల 18 నుంచి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ ‘ప్రొటెక్ట్’ పోస్టర్, వలంటీర్ల ప్రొటెక్ట్ టీ షర్టులను ఆవిష్కరించారు. సైబర్ క్రైం డీసీపీ శ్రీబాల, ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ రమేష్ కాజా, సీఈఓ నవీద్ ఖాన్, ఉమెన్ అండ్ చైల్డ్ భద్రత వింగ్ డీసీపీ సృజన, మాదాపూర్ డీసీపీ వినీత్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, చంద్రకాంత్, సైబర్ ఎక్స్‌పర్ట్ ప్రవీణ్ తంగళ, భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment