మౌలిక వసతులపై దృష్టి సారించండి
అనంతగిరి: అన్ని ప్రభుత్వ వసతిగృహల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లోని మేజర్, మైనర్ రిపేర్ పనులు, తాగునీరు, టాయిలెట్స్, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించాలన్నారు. మీరు ఇచ్చే అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేస్తామన్నారు. పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రిపేర్లకు ముందు తర్వాత ఫొటోలు జత చేయాలన్నారు. భోజనంలో మెనూ తప్పక పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా హాస్టల్స్‌లో ఉండే సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్‌డీఏ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ అధికారులు, సంబంధిత వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నుంచి కమిషనర్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పొరపాట్లకు తావివ్వకుండా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతోంది? రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు? సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇప్పటివరకు ఎంతమంది వివరాలను సేకరించారు? ఆన్‌లైన్‌లో ఎన్ని వివరాలను అప్‌లోడ్ చేశారని అధికారులను వివరాలు అడిగి వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరిస్తూ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్‌లో పొందుపర్చాలని చెప్పారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు ప్రతీ నెల రూ.10వేలు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కాక అప్పులు చేసి వంట చేస్తున్నామని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ చార్జీలు పెంచాలన్నారు. ప్రతీ పాఠశాలకు గ్యాస్ సిలిండ్ ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లమ్మ, సాజిదా బేగం, లక్ష్మి, నారాయణమ్మ, సతీమ్మ, ఆశమ్మ, అంజమ్మ, జంగమ్మ, వెంకటమ్మ, కృష్ణ, ఖాసీంబీ, మాలన్‌బీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment