రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం
దుద్యాల్ : రైతు కంట కన్నీరు కారేలా ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్రానికి అరిష్టం కలుగుతుందని.. వారికి అన్యాయం చేయరాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం దుద్యాల్ మండలం హకీంపేట్‌లో నిర్వహించిన రైతాంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లగచర్ల ఘటనలో రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ రద్దు కోసం సీపీఎం ఎంతో పోరాటం చేసిందని గుర్తుచేశారు. సమస్యను సీఎంకు వివరిస్తే ఫార్మా స్థానంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడకు బలవంతంగా భూములు తీసుకోరాదని సూచించారు. రైతులు అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో కొడంగల్‌కు చెందిన బడా నాయకుల భూములు ఉన్నాయని, వాటిని వదిలేసి గిరిజనుల భూములు తీసుకుంటే ఊరుకోమన్నారు.
అమిత్‌షా వ్యాఖ్యలు సరికాదు
ప్రస్తుతం అనుభవిస్తున్న రిజర్వేషన్లు, పదవులు అంబేడ్కర్ పుణ్యమే అని తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో అన్ని కులాలు, వర్గాలకు పదవులు అందుతున్నాయంటే అంబేడ్కర్ పెట్టిన భిక్షే అని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిపై అమిత్ షా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ, డీజీ నరసింహా రావ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్‌రాములు, జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రీనివాస్, బుగ్గప్ప, సుదర్శన్, సతీష్, నర్సమ్మ, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వారికి ఎర్ర జెండా అండగా ఉంటుంది
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
హకీంపేట్ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
Comments
Please login to add a commentAdd a comment