డిగ్రీ కాలేజీకి తాళం వేసిన విద్యార్థులు
తాండూరు టౌన్: తరగతులు కొనసాగక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు తాళం వేశారు. ఈ ఘటన తాండూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న శ్రీసాయి డిగ్రీ కళాశాలలో 400 మంది విద్యార్థులతో కొనసాగుతోంది. గతేడాది నవంబర్ చివరిలో సెమిస్టర్ పరీక్షలు ముగిసిన నాటి నుంచి, సుమారు 45 రోజులుగా కళాశాలలో అధ్యాపకులు పాఠాలు చెప్పడం విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కళాశాల కరస్పాండెంట్ మల్లేశ్ యాదవ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. పాఠాలు కొనసాగక పోవడంతో తమ విలువైన సమయం వృధాగా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యార్థులు, బీసీ జేఏసీ విద్యార్థి సంఘం నాయకులను ఆశ్రయించడంతో కళాశాల ఎదుట నిరసనకు దిగారు. కళాశాల కరస్పాండెంట్ వచ్చి తరగతులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. కళాశాలకు తాళం వేసామని బీసీ జేఏసీ విద్యార్థి సంఘం నాయకులు సాయి, మనోహర్ తెలిపారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కొన్ని నెలల నుంచి యాజమాన్యం చెల్లించకపోవడంతోనే పాఠాలు చెప్పడం లేదని పలువురు అధ్యాపకులు తెలిపారు. ఈ విషయమై కళాశాల కరస్పాండెంట్ మల్లేశ్ యాదవ్‌ను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
45 రోజులుగా పాఠాలు చెప్పని వైనం
స్పందించని యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment