![నీటి సమస్య రావొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04kgdgl10f-360013_mr-1738718092-0.jpg.webp?itok=wzrUGmpC)
నీటి సమస్య రావొద్దు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● పనుల పురోగతిపై సమీక్ష
కొడంగల్: వేసవిలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అలాగే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని కడా కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. సంబంధిత అధికారులు సర్వేలు చేసి సమస్యలు రాకుండా పనులు చేయాలన్నారు. గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగరాదన్నారు. పనులు చేసే క్రమంలో విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించి ఆటంకాలు ఉంటే మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ భవనాల మరమ్మతులతో పాటు విద్యుత్, పెయింటింగ్ పనులు పూర్తి చేసి అందంగా తీర్చి దిద్దాలన్నారు. అంగన్‌వాడీ, మండల సమీకృత భవనాలు, ప్రహరీలు, అదనపు తరగతి గదుల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన రూ.5లక్షల లోపు సీసీ రోడ్డు పనులను చేయాలన్నారు. గ్రామ కూడళ్లలో నాణ్యమైన హైమాక్స్ వీధి దీపాలను బిగించాలన్నారు. సమావేశంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, ఈఈ చల్మారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ నీలావతి వివిధ శాఖల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
మరమ్మతులు చేపట్టండి
కొడంగల్ మండలం అంగడి రాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పీహెచ్‌సీని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. భవన లీకేజీలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా లైట్లు, ఫ్యాన్లు సమకూర్చాలని ఆదేశించారు. సబ్ సెంటర్లకు పంపిస్తున్న మందుల వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డాక్టర్లు బుస్రా, జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment