విశాఖపట్నం: జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు లారీ టైర్ల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మర్రిపాడుకు చెందిన జన్ని లోకనాథం(25) చినగదిలి దరి హెల్త్‌సిటీలో జరుగుతున్న ఓ భవన నిర్మాణంలో తాపీమేసీ్త్రగా పని చేస్తున్నాడు. అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని బంధువు కూర్మనాథపురం మీనా(30) అక్కడి మరో రేకుల షెడ్‌లో ఉంటోంది.
ఆమె సాగర్‌నగర్ దరి గుడ్లవానిపాలెంలోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో లోకనాథం బైక్‌పై ఆమెను హోటల్ వద్ద దించేందుకు వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై విశాఖ వేలీ స్కూల్ కూడలి వద్ద సాగర్‌నగర్ వైపు మలుపు తిరుగుతుండగా.. వెనుకనే వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో కింద పడిన లోకనాథం, మీనాలిద్దరూ లారీ వెనుక చక్రాల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటుగా వెళ్లిన వారికి ఈ సంఘటన కంటతడి పెట్టించింది. కాగా.. ఈ లారీ ముడి ఇనుము లోడుతో నగరం నుంచి సాలూరు వెళుతోంది. ఈ ప్రమాదం కూడలిలో జరగడంతో.. నగరం నుంచి మధురవాడ వైపు వెళ్లే వాహనాలు డెయిరీఫాం వరకు వరకు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్రమబద్ధీకరించారు. సీఐ ద్వారా సమాచారం తెలుసుకున్న ఏడీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. లోకనాథం అవివాహితుడు. మీనాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ హోటల్‌లో పనిచేస్తోంది. సంక్రాంతికి శనివారం ఇద్దరు సొంతూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని సహచరులు కంటతడి పెట్టారు. ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment