ఇచ్చేయ్..!
మనోడే..
రైతు బజార్లనూ వదలని కూటమి నేతలు
● స్టాళ్లకు డిమాండ్‌తో వసూళ్ల పర్వం ● 30 స్టాళ్ల కోసం 140కి పైగా దరఖాస్తులు ● 11న స్టాళ్ల కేటాయింపునకు డ్రా
విశాఖ విద్య: కూటమి నేతలు ఏ ఒక్కర్నీ వదలడం లేదు. రైతుబజార్లలో కూడా రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. అర్హులైన రైతులు, డ్వాక్రా గ్రూపులు, దివ్యాంగులకు రైతుబజార్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తుండగా.. వీటిని తాము చెప్పిన వారికే ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నారు. ఇందుకు వసూళ్లకు తెరతీసినట్లు సమాచారం. జిల్లాలో సీతమ్మధార మినహా మిగతా రైతుబజార్లలో డ్వాక్రా గ్రూపులకు 23, దివ్యాంగులకు 7 స్టాళ్లను కేటాయించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న చిట్టివలస రైతుబజార్‌తోపాటు మిగతా రైతు బజార్లలో ఖాళీగా ఉన్న 30 స్టాళ్ల కోసం ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పర్యవేక్షణలో డ్రా తీయనున్నారు.
జిల్లాలో 13 రైతుబజార్లు
జిల్లాలో 13 రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో సీతమ్మధార, ఎంపీవీ కాలనీ, కంచరపాలెం రైతుబజార్లలో అమ్మకాలు జోరుగా సాగుతాయి. గోపాలపట్నం, గాజువాక, పెదవాల్తేరు, స్టీల్‌ప్లాంట్, పెందుర్తి, మధురవాడ రైతుబజార్లు సైతం వినియోగదారులు బాగానే వస్తుంటారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలో కలపి మొత్తంగా 1,307 స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 220 వరకు డ్వాక్రా గ్రూపులు, దివ్యాంగులకు కేటాయించారు. మిగతా స్టాళ్ల నిర్వహణకు అర్హతల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.
స్టాళ్లకు డిమాండ్
జిల్లాలోని రైతు బజార్లలో దుకాణాల నిర్వహణకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 2 వేల కార్డులను జారీ చేశారు. మరో 670 మంది కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. స్టాళ్లు పెట్టుకునేందుకు కార్డులు ఇప్పించాలని ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వారిలో కొంతమంది కూటమి నేతలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్డుకు ఇంతని బేరం పెట్టి, రైతుబజార్లలో వెంటనే తమ వారికి చోటిచ్చేయాలని సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment