నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం కోసం 46 అంశాలతో ప్రధాన అజెండా మరో 21 అంశాలతో అనుబంధ అజెండాను సభ్యులకు అందజేశారు. అక్టోబర్ 4, 18 తేదీల్లో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో చేసిన తీర్మానాలు, నవంబర్ 8, 29 తేదీల్లో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో చేసిన తీర్మానాల వివరాలు కూడా సభ్యుల ముందుకు రానున్నాయి. 6వ వార్డు పీఎం పాలెం చివరి బస్టాప్ బాబా కళాశాల సమీపంలో గల శ్మశాన వాటికకు రూ.62 లక్షలతో ప్రహరీ నిర్మాణం, 9వ వార్డు విశాలాక్షీనగర్ రామాలయం వీధి కొండవాలు ప్రాంతం వద్ద రూ.68.60 లక్షలతో రక్షణ గోడ, కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణం, 96వ వార్డు పెందుర్తి బ్రిడ్జి నుంచి గొర్లి వారి కల్లాలు వరకు రూ.కోటి 23 లక్షల ఇరవై నాలుగు వేలతో హాట్‌మిక్స్ పద్ధతిపై బీటీ రోడ్డు, 22వ వార్డు పిఠాపురం కాలనీలో పాత శిథిలావస్థలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలో రూ.కోటి 89 లక్షల 30వేలతో జీ+1 తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పరిపాలన ఆమోదానికి చర్చకు రానుంది. అన్ని జోన్లకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు చర్చకు రానున్నాయి. అలాగే జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడా ప్రాంగణం (స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్(ఆర్కే బీచ్), ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, రాజీవ్ ఇండోర్ జిమ్నాజియం(ఎంవీపీ కాలనీ), రాజీవ్ క్రీడా ప్రాంగణం(గాజువాక), శ్రీరాజరాజేశ్వరి కళాక్షేత్రం(గాజువాక), కోరమండల్ గేట్ ఎదురుగా క్రీడా ప్రాంగణం(మల్కాపురం), లాన్ టెన్నిస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్(త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దరి), మున్సిపల్ ఇండోర్ స్టేడియం(భీమిలి), జీవీఎంసీ బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎన్‌టీఆర్ స్టేడియం(అనకాపల్లి), రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంల్లో సభ్యత్వ రుసుం, అద్దెలు, ఇతర రుసుంలు సవరించే ప్రతిపాదన ఆమోదానికి చర్చకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment