డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) కౌన్సిల్ ఆమోదం మేరకు జీతాలు బిల్లు పెట్టాలని, లేకపోతే ఈ నెల 26 నుంచి నీటి సరఫరా విభాగం కార్మికులు సమ్మెకు వెళ్తారని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహదేవ్ ఆనందరావు హెచ్చరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికులకు జీవో 7 ప్రకారం జీతాల పెంపునకు కౌన్సిల్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. జీవో ప్రకారం పదేళ్ల అనుభవం ఉన్న అవుట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.15,000 నుంచి రూ.18,500కు, ఐటీఐ అర్హత ఉన్నవారికి రూ.21,500కు వేతనం పెరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. డిసెంబర్ జీతాల బిల్లు ప్రాసెస్ 18న మొదలై 25 వరకు జరుగుతుందని, ఆ తర్వాత కమిషనర్ అనుమతితో జీతాలు విడుదల అవుతాయని గుర్తు చేశారు. ఈ మేరకు జీతాలు బిల్లు పెట్టకపోతే 26 నుంచి కార్మికులు సమ్మె చేస్తారన్నారు. 169 మంది కార్మికుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు ఇ.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యం, నిర్వాహక అధ్యక్షుడు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జీవన్ పాల్గొన్నారు.
లేకపోతే నీటి సరఫరా విభాగం కార్మికుల సమ్మెకు వెళతారు
జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment