విశాఖ స్పోర్ట్స్: మార్వాడీ క్రికెట్ లీగ్ విజేతగా పరశురామ్ ఎలెవెన్ జట్టు నిలిచింది. రైల్వే మైదానంలో గురువారం జరిగిన ఫైనల్స్‌లో పరశురామ్ జట్టు, మహాకాళీ జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పరశురామ్ జట్టు 12 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ప్రతిగా మహాకాళీ జట్టు 53 పరుగులకే ఆలౌట్ అయింది. మహాకాళీ ఉద్యోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 11 జట్లు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి హాజరై విజేతలకు ట్రోఫీతో పాటు రూ.41,000, రన్నరప్‌కు ట్రోఫీతో పాటు రూ.31,000 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయన్నారు.
పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదు
పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విధుల్లో అవినీతికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గంగరాజును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగర స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న హెచ్‌సీ గంగరాజు క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో ఆయన్ని తక్షణమే విధులు నుంచి తొలగించినట్లు చెప్పారు. పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని, ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా లంచం అడిగినా, తీసుకున్నా వెంటనే తనకు 79950 95799 నంబర్‌లో తెలియజేయవచ్చన్నారు. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment