ఉక్కు రక్షణకై 19న పాత గాజువాకలో నిరసన
సీతమ్మధార: విశాఖ ఉక్కు పోరాటంలో భాగంగా ఈ నెల 19న పాత గాజువాకలో జరిగే ఉక్కు పరిరక్షణ పోరాటంలో విశాఖ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలను గురువారం డిఫెన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకుడు రెడ్డి వెంకటరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ ప్రైవేటీకరించడానికి కంకణం కట్టుకుందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారా స్థాపించిన పరిశ్రమ అని, 32 మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజల భూములు, దేశవ్యాప్త నిరసనలు వెరసి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని గుర్తు చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన మొదలు నాలుగేళ్లుగా నిర్విరామంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు రక్షణ పోరాటంలో పాల్గొంటున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేసి, కార్మికులకు బకాయి జీతాలు చెల్లించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. పబ్లిక్ సెక్టార్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకుడు కుమార్ మంగళం, డిఫెన్స్ యూనియన్ నాయకులు గోపాలకృష్ణ, జగన్నాథం, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు ఎన్.వి.రమణ, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు, చలపతి, కుమారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment