వీఆర్‌ఎస్ బాటలో.. ఉక్కు ఉద్యోగులు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) పథకానికి ఉద్యోగుల నుంచి స్పందన లభిస్తోంది. బుధవారం నుంచి దరఖాస్తుకు పోర్టల్ అందుబాటులో ఉంచారు. మొదటి రోజు 192 మంది దరఖాస్తు చేశారు. రెండవ రోజు ఆ సంఖ్య 384కు చేరింది. వీరిలో అధికారులు 184, కార్మికులు 200 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉండటంతో.. ఎక్కువ మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. స్టీల్‌ప్లాంట్‌లో రోజురోజుకు దిగజారిపోతున్న పరిస్థితులకు ఈ దరఖాస్తులు అద్దం పడుతున్నాయి. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీ, ఎల్‌టీఏలు నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులకు 6 శాతం పెర్క్స్ తొలగించగా, కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ నిలిపివేత, ఉక్కు క్వార్టర్ల నివాసులకు విద్యుత్ చార్జీల పెంపు ద్వారా తీవ్రమైన ఆర్థిక భారం మోపారు. అదనపు ప్రయోజనాలు ఎన్ని తొలగించినా.. జీతమైనా సరిగా ఇస్తున్నారంటే అదీ లేదు. గత నాలుగు నెలలుగా యాజమాన్యం ఉద్యోగులకు 250 శాతం జీతం పెండింగ్‌లో పెట్టింది. పీఎఫ్ ట్రస్ట్, ఎస్‌ఏబీఎఫ్ ట్రస్టు, త్రిఫ్ట్ సొసైటీలకు సుమారు రూ.వెయ్యి కోట్లు బకాయి పడటంతో ఉద్యోగులకు మరింత నష్టం కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సక్రమంగా చెల్లించట్లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగిపోయింది. ఎంత వేగంగా ప్లాంట్ నుంచి బయటపడదామా అని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచి చూడాలి.
రెండు రోజుల్లో 384 మంది దరఖాస్తు
నెలాఖరు వరకు దరఖాస్తు గడువు
Comments
Please login to add a commentAdd a comment