రచయిత ఎంవీవీ పార్థివ దేహం ఏఎంసీకి అప్పగింత
మహారాణిపేట: ప్రముఖ రచయిత, హేతువాది, సామాజిక కార్యకర్త, శరీర, అవయవదాన ఉద్యమకారుడు ఎంవీవీ సత్యనారాయణ(76) పార్థివ దేహాన్ని గురువారం ఆంధ్రా మెడికల్ కళాశాలకు అప్పగించారు. బుధవారం ‘రవళి’పత్రికకు ‘ప్రమాదం అంచున’సీరియల్ భాగాన్ని పూర్తి చేసి.. మిత్రులతో ఫోన్ సంభాషిస్తూ గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సత్యనారాయణ మృతి విశాఖ సాహితీ లోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన చివరి కోరిక మేరకు అతని భార్య సత్యవతి, కుమార్తెలు శిరీష, సౌజన్య, కుటుంబ సభ్యుల సహకారంతో, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్,చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి పర్యవేక్షణలో ఏఎంసీ కాలేజీ అనాటమీ విభాగానికి ఎంవీవీ పార్థివదేహాన్ని దానంగా అందజేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా శరీర అవయవ దాతల సంఘం సభ్యులు టి.శ్రీరామమూర్తి, రామ ప్రభు, పీలా హరిప్రసాద్, మంతెన వెంకట రాజు, విజ్ఞానంద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment