తహసీల్దార్ కార్యాలయ అటెండర్ మృతి
సీతమ్మధార : రోడ్లు భవనాల శాఖ క్వార్టర్లలో నివాసం ఉంటున్న అటెండర్ పొరపాటున పురుగు మందు తాగి మరణించారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాలివీ. భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ముస్తాఫా(48) భార్య మహ్మద్ ఫాతిమా, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఐదేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ముస్తాఫా పెద్ద కుమార్తె ఎం.దె.సుఫియా పీజీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, రెండో కుమార్తె రఫియా ఇంటర్ పూర్తి చేసి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటోంది. కాగా.. ఇంటి వరండాలోని పువ్వులు, పండ్ల మొక్కల కోసం ఈ నెల 14న ముస్తాఫా పురుగు మందు తీసుకొచ్చారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం మందు తీసుకుని మొక్కలకు కొట్టడానికి గ్లాసులో సిద్ధం చేయగా.. అతని భార్య, కుమార్తెలు చీకటి కావడంతో తెల్లవారుజామున వేయమని చెప్పారు. మధుమేహం కారణంగా అతను ప్రతి రోజూ కాకరకాయ జ్యూస్ తాగుతున్నారు. ఈ తరుణంలో బుధవారం కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగు మందును పొరపాటున తాగేశారు. వెంటనే అతన్ని ఆటోలో రామ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. అతని భార్య ఫిర్యాదు మేరకు ద్వారకా సీఐ డి.వి.రమణ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment