కానిస్టేబుల్ వెనుక ఏసీపీ?
కలెక్షన్లన్నీ కానిస్టేబుల్ ద్వారానే..
● ఆయన అకౌంటు ద్వారా రూ. కోట్లలో లావాదేవీలు? ● అనకాపల్లి నుంచి సిటీకి పోస్టింగులోనూ ఏసీపీదే కీలకపాత్ర ● కూటమి ఎమ్మెల్యేల వ్యవహారంపై ఇప్పటికే ఫిర్యాదులు ● బెట్టింగ్ ముఠా పట్టుబడిన సమయంంలో దొరికిన నగదుపైనా విచారణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సస్పెండైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) కానిస్టేబుల్ పల్లా గంగరాజు వ్యవహారం వెనుక ఓ ఏసీపీ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సదరు ఏసీపీ ద్వారానే వ్యవహారాలన్నీ ఈ కానిస్టేబుల్ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి ఎమ్మెల్యేల పాత్రపైనా ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు బంధువు, పీఏగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తికి ఉన్న లింకులపైనా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మొన్నటి వరకు అనకాపల్లిలో విధులు నిర్వహించిన ఈ కానిస్టేబుల్.. ఏసీపీ ద్వారానే బదిలీ చేసుకుని విశాఖ సిటీకి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కానిస్టేబుల్ సెల్ నంబరు ద్వారా జరిపిన లావాదేవీలన్నీ గుర్తించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా కేవలం కానిస్టేబుల్ అకౌంటు ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కానిస్టేబుల్ ద్వారా నిరంతరాయంగా సంభాషిస్తూ.. ప్రతి నెలా మామూళ్లు దండుకుంటున్న ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యే పీఏ వ్యవహారం కూడా త్వరలో బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.
గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన సమయంలోనూ సదరు ఏసీపీ ఈ కానిస్టేబుల్‌కు తన వద్దనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అప్పటినుంచి వీరి బంధం రోజురోజుకీ బలపడినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన సమయంలో ఎక్కడెక్కడ ఎంత మొత్తం వసూలు చేయాలి? తనకు ఎక్కడ ఇవ్వాలనే వివరాలన్నీ సదరు ఏసీపీ డైరెక్షన్‌లోనే పనిచేసేవారని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. స్పాలు మొదలుకుని, బ్లాక్ ఆయిల్ దందా, పేకాట డెన్ నిర్వాహకులతో పాటు గంజాయి బ్యాచ్ నుంచి కూడా వసూళ్లకు తెగబడినట్టు విమ ర్శలున్నాయి. ఈ విధంగా వసూలు చేసిన మొత్తా న్ని ఏసీపీకి అందజేయడంలో కీలకపాత్ర ఈ కానిస్టేబుల్ పోషించారనే తెలుస్తోంది. వీరిద్దరి డిపార్టుమెంట్లు వేరువేరుగా ఉన్నప్పటికీ..ఆర్థిక బంధం మాత్రం యథావిధిగా కొనసాగుతున్నట్టు తెలు స్తోంది. తాజా వ్యవహారంలో కూడా ఏసీపీ పాత్రపైనా ‘గట్టి’ విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసుశాఖలో వినిపిస్తోంది.
నెల నెలా మామూళ్లు...!
స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌తో అవినాభావ సంబంధం ఉన్న కూటమిలోని ఓ ఎమ్మెల్యేకు నెల నెలా మామూళ్లు ముడుతున్నాయని కూడా తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ ముఠా నుంచి మామూళ్లు అందజేయడంలో ఈ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక ఎమ్మెల్యే పీఏనని చెప్పుకునే దూరపు బంధువు పాత్ర కూడా కీలకంగా ఉంది. వాస్తవానికి క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న తర్వాత టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించిన వ్యవహారంలో ఈ పీఏ వ్యవహారశైలిపై కూడా సీపీ సీరియస్‌గా ఉన్నట్టు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ‘చిట్టి’గా కాకుండా ‘గట్టి’గా విచారణ జరిపితే దొంగలందరూ బయటకు వస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సెల్ ఫోన్ లింకులపై సీపీ దృష్టి
వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) కానిస్టేబుల్ ఫోన్ నంబరును పరిశీలిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సదరు కానిస్టేబుల్ అకౌంట్ ద్వారా రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. డిపార్టుమెంటులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు పోలీసులకు కూడా తన ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేశారని సమాచారం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌లోని కొంత మందికి కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాలోని సభ్యుల నుంచి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా విచారణ జరిపితే మరింత మంది డిపార్టుమెంటు దొంగలు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న లగుడు రవిని పట్టుకున్న సమయంలో కూడా భారీగానే నగదు దొరికిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ నగదును చూపకుండా తప్పించిన వ్యవహారం ఇప్పుడు పోలీసుశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment