ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ?
● అవగాహన లోపమా? సిబ్బంది నిర్లక్ష్యమా..?? ● నగరంలో విచ్చలవిడిగా వినియోగం
హెచ్చరించినా
పట్టించుకోవడం లేదు
జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ నిబంధనల మేరకు 120 మైక్రాన్ల లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడిన దుకాణాల నుంచి అపరాధ రుసుముతో పాటు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న చిన్న వ్యాపారస్తులకు మొదటిసారి రూ.2,500, రెండోసారి రూ.5వేలతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. జీఎస్టీ పరిధిలో గల పెద్ద వ్యాపారస్తులు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించినా, సరఫరా చేసినా, వినియోగించినా, తయారు చేసినా మొదటిసారి పట్టుబడితే రూ.20వేలు, రెండోసారి పట్టుబడితే రూ.40వేల అపరాధ రుసుంతో పాటు వారి అన్ని వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిధిలో జనవరి ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేరుకే నిషేధం గానీ పాలిథిన్ కవర్ల వినియోగం ఏ మాత్రం తగ్గలేదు. యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని విశాఖ నగరం నుంచి తరిమి కొట్టాలని, ప్లాస్టిక్‌పై ఐదేళ్ల్లుగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి రెండు నుంచి మూడొందల ఏళ్లు పడుతుందని, మానవాళితో పాటు జల, చర జీవరాసులకు ఎంతో హాని కలుగుతూ, తద్వారా క్యాన్సర్, భయంకర వ్యాధులు సంభవిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించింది. వీటికి బదులు ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులోకి తెచ్చింది. అందుకు తగిన విధంగా మార్కెట్లు, రైతు బజార్లు, పండ్ల దుకాణాలు వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ఇప్పటికే ప్రత్యామ్నాయాలు, ఇన్‌స్పెక్షన్ సిద్ధాంతాలపై స్కిల్ అప్ గ్రెడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంతోపాటు, శిక్షణ కార్యక్రమం పక్షం రోజుల క్రితమే నిర్వహించారు.
మరి ఎక్కడ లోపం?
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై జీవీఎంసీ అధికారులు..సిబ్బంది అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. అంతేగాక అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి లోతుగా వెళ్లలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు.
కఠిన చర్యలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. ఒక్క రోజులోనే 27 వేల వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ‘సే నో టు ప్లాస్టిక్’ క్యూఆర్ కోడ్ కల్గిన స్టిక్కర్లు అతికించాం. నగర ప్రజలు, వ్యాపార, వినియోగదారులు, కొనుగోలు దారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలి. ఎవరైనా వినియోగిస్తే చర్యలు తప్పవు.
– పి.సంపత్‌కుమార్, కమిషనర్, జీవీఎంసీ
సహకరించండి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి అంతా సహకరించాలి. యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని విశాఖ నగరం నుంచి తరిమి కొడదాం. ప్లాస్టిక్ నియంత్రణపై ఐదేళ్లుగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించాలి.
–గొలగాని హరి వెంకటకుమారి, మేయర్
Comments
Please login to add a commentAdd a comment